YS Sharmila: షర్మిల పాదయాత్రలో కత్తితో వార్డు సభ్యుడి హల్‌చల్.. కార్యకర్తకు గాయాలు

TRS Ward member Halchal with knife in sharmila Padayatra
  • యాదాద్రి జిల్లా బొల్లేపల్లిలో ఘటన
  • కత్తితో వాహనం టైరును కోసేసిన వార్డు సభ్యుడు శ్రావణ్ 
  • ఫ్లెక్సీ కడుతుండగా తాడును బలంగా లాగడంతో కార్యకర్త మెడకు చుట్టుకున్న వైనం
  • రాస్తారోకోకు దిగిన షర్మిల
వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైటీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన మహాపాదయాత్రలో టీఆర్ఎస్ వార్డు సభ్యుడు ఒకరు కత్తితో హల్‌చల్ చేయడం కలకలం రేపింది. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం నుంచి మొదలైన షర్మిల పాదయాత్ర మధ్యాహ్నం బొల్లేపల్లి చేరుకుంది. సాయంత్రం అక్కడే ‘షర్మిలక్కతో మాటముచ్చట’ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఇందుకోసం కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఈ క్రమంలో వార్డు సభ్యుడు తాళ్లపల్లి శ్రావణ్ మాంసం కోసే కత్తితో అక్కడికి చేరుకుని అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. ఓ వాహనం టైరును కోసేశాడు. పీహెచ్‌సీ వద్ద ఫ్లెక్సీ కడుతుండగా తాడును బలంగా లాగడంతో అది వైటీపీ కార్యకర్త శివరాజ్ మెడకు ఉరిలా బిగుసుకుంది. బాధితుడు కేకలు వేయడంతో పోలీసులు శ్రావణ్‌ను పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. మెడకు తాడు బలంగా బిగుసుకుపోవడంతో కార్యకర్తకు గాయమైంది. మరోవైపు, విషయం తెలిసిన షర్మిల కార్యకర్తలతో కలిసి రాస్తారోకోకు దిగారు. శ్రావణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. తమ యాత్రను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విఫలయత్నం చేస్తోందని విమర్శించారు.
YS Sharmila
Yadadri Bhuvanagiri District
TRS
YSRTP

More Telugu News