Cricket: పాంటింగ్ కాకపోయుంటే తల పగులగొట్టేవాడిని: షోయబ్ అక్తర్

  • 1999 టెస్ట్ సిరీస్ ను గుర్తు చేసుకుంటూ కామెంట్
  • కావాలనే బౌన్సర్లను సంధించానని వెల్లడి
  • పాంటింగ్ కు పరీక్ష పెట్టానన్న పాకిస్థానీ పేసర్
I would have chopped off head if had not been Ponting Says Akhtar

నిన్న సెహ్వాగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రావల్పిండి ఎక్స్ ప్రెస్, పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.. తాజాగా ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ పైనా అలాంటి వ్యాఖ్యలు చేశాడు. 1999లో పెర్త్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ ను గుర్తు చేసుకుంటూ అతడు ఆ వ్యాఖ్యలు చేశాడు. అప్పటికే సిరీస్ లో 0–2తో వెనుకబడిన పాకిస్థాన్ ను మూడో టెస్టులో ఎలాగైనా గట్టెక్కించాలని షోయబ్ అనుకున్నాడట. ఈ క్రమంలోనే బౌన్సర్లను సంధిచాలని డిసైడ్ అయ్యాడట. 

‘‘ఆ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేకుండా ఎవరినో ఒకరిని గాయపరచాలనుకున్నా. అందులో భాగంగానే బంతులను వేగంగా విసిరా. బౌన్సర్లను సంధించా. అంతకుముందు మ్యాచ్ లలో పాంటింగ్ ముందు తేలిపోయిన నేను.. ఈసారి పాంటింగ్ కు పరీక్ష పెట్టాలనుకున్నా. కావాలనే అతడికి బౌన్సర్ల మీద బౌన్సర్లు వేశా. అక్కడ రికీ పాంటింగ్ కాకుండా వేరే వాళ్లు ఉండి ఉంటే తల పగులగొట్టేవాడిని’’ అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. 

ఆస్ట్రేలియా ఆటగాళ్లలాగే తానూ దూకుడుగా ఉండడంతో.. తన ఆలోచన వారికి బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్ ఆటగాడినే అయినా ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఆటిట్యూడ్ ఉండడంతో వారికి తాను నచ్చానన్నాడు. 2005లో జస్టిన్ లాంగర్ తో గొడవ జరిగిందని, మాథ్యూ హేడెన్ తోనూ ఘర్షణ జరిగిందని గుర్తు చేసుకున్నాడు. కొట్టుకునే వరకు వెళ్లకపోయినా.. మాటలతోనే యుద్ధం చేసుకున్నంత పనైందన్నాడు. 

అయితే, అప్పట్లో లాగా ఇప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్లలో దూకుడు వైఖరి లేదని, అంతా సున్నితంగా ఉన్నారని చెప్పాడు. ఎందుకో ఏమో తెలియదుగానీ.. వారి దూకుడు తగ్గిపోయింది. బ్రిస్బేన్ లోని జెఫ్ థామ్సన్ ఇల్లు తనకు రెండో ఇల్లు లాంటిదని చెప్పుకొచ్చాడు.

More Telugu News