Mohan Babu: సినీ కార్మికుల పిల్లలకు బంపరాఫర్ ప్రకటించిన మోహన్ బాబు!

  • ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ కు చెందిన వారి పిల్లలకు ఆఫర్
  • తన యూనివర్శిటీలో ఫీజులో రాయితీ ప్రకటన  
  • అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న మోహన్ బాబు
Mohan Babu announces fees concession to children of 24 crafts in his university

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబులో మానవతా కోణం ఉన్న సంగతి తెలిసిందే. తన విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ ద్వారా ఎందరో పేద విద్యార్థులకు ఆయన విద్యను అందిస్తున్నారు. గత 30 ఏళ్లుగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. తెలుగు సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ కు చెందిన కార్మికుల పిల్లలకు 'మోహన్ బాబు యూనివర్శిటీ'లో ఫీజుల్లో రాయితీ ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో ద్వారా మాట్లాడారు. 

సినీ కళామతల్లి తనకు ఎంతో ఇచ్చిందని... అలాంటి పరిశ్రమకు ఉడతాభక్తిగా ఏదైనా చేయాలనే ఆలోచన తనకు వచ్చిందని మోహన్ బాబు తెలిపారు. ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ లో పని చేస్తున్న వారి పిల్లలు తమ యూనివర్శిటీలో చదువుకోవాలనుకుంటే ఫీజులో రాయితీ ఇస్తానని ప్రకటించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. 

1992లో శ్రీ విద్యానికేతన్ ను ప్రారంభించామని మోహన్ బాబు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లోని కొందరు పిల్లలకు, ఇండస్ట్రీకి చెందిన మరి కొంతమంది పిల్లలకు... కులమతాలకు అతీతంగా 25 శాతం మందికి విద్యానికేతన్ లో ఉచితంగా విద్యను అందిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు శ్రీ విద్యానికేతన్ విద్యాలయాలన్నీ 'మోహన్ బాబు' యూనివర్శిటీగా మారాయని తెలిపారు.

More Telugu News