ICC Womens World Cup 2022: మిథాలి, యస్తిక అర్ధ సెంచరీలు.. భారీ స్కోరు దిశగా భారత్

Mithali and Yashika Bhatia complete Half Centuries
  • భారీ షాట్‌కు యత్నించి ఔటైన యస్తిక
  • వన్డేల్లో 63వ అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న మిథాలి
  • భారత్ కోల్పోయిన మూడు వికెట్లు డెర్సీ ఖాతాలోకే..
మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరు దిశగా పరుగులు తీస్తోంది. గత కొన్ని రోజులుగా విఫలమవుతున్న టీమిండియా సారథి మిథాలీ రాజ్, యస్తికా భాటియా అర్ధ సెంచరీలు నమోదు చేశారు. 

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు 11 పరుగుల వద్ద తొలి దెబ్బ తగిలింది. 10 పరుగులు చేసిన ఓపెనర్ స్మృతి మంథాన పెవిలియన్ చేరింది. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ షెఫాలీ వర్మ (12) కూడా అవుటైంది. దీంతో క్రీజులోకి వచ్చిన మిథాలీ రాజ్.. యస్తికతో కలిసి జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడింది. ఇద్దరూ క్రీజులో కుదురుకున్నాక జోరు పెంచారు. 

వీరి జోడీని విడదీసేందుకు ఆసీస్ బౌలర్లు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తిచేసుకున్నారు. యస్తికకు ఇది వన్డేల్లో రెండో అర్ధ సెంచరీ కాగా, మిథాలీకి 63వది. ఆ తర్వాత కూడా దూకుడు పెంచే ప్రయత్నంలో యస్తిక అవుటైంది. 83 బంతుల్లో 6 ఫోర్లతో 59 పరుగులు చేసిన యస్తిక.. డెర్సీ బ్రౌన్ బౌలింగులో భారీ షాట్‌కు యత్నించి డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో పెర్రీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ప్రస్తుతం 32 ఓవర్లు ముగిశాయి. ఇండియా మూడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హర్మన్ ‌ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్ (56) క్రీజులో ఉన్నారు.  కాగా, భారత జట్టు కోల్పోయిన మూడు వికెట్లు డెర్సీకే దక్కడం గమనార్హం.
ICC Womens World Cup 2022
Team India
Australia
Mithali Raj
Yastika Bhatia

More Telugu News