Chinna Jeeyar Swamy: ఆ వ్యాఖ్యలకు ముందు, వెనుక ఏమున్నదో చూడాలి: వివాదంపై చిన్నజీయర్ స్వామి వివరణ

  • వివాదంలో చిన్నజీయర్ స్వామి వ్యాఖ్యలు 
  • సమ్మక్క-సారలమ్మను అవమానించారంటూ ఆరోపణలు 
  • అల్ప ప్రచారం కోసం ఈ విధంగా చేస్తున్నారన్న చిన్నజీయర్ 
  • వారి విచక్షణకే వదిలేస్తున్నానని వెల్లడి
Chinna Jeeyar Swamy press meet

ఎప్పుడూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో బిజీగా ఉండే చిన్నజీయర్ స్వామి అనూహ్యంగా వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ గిరిజన వన దేవతలు సమ్మక్క, సారలమ్మలపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆదివాసీ దేవతలను చిన్నజీయర్ స్వామి చులకనగా మాట్లాడారంటూ ప్రచారం జరిగింది. దాంతో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. టీవీ చానళ్లలో జరిగిన చర్చా కార్యక్రమాల్లో చిన్నజీయర్ పై పలువురు ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. 

తన ప్రతిష్ఠకు భంగం కలుగుతున్న నేపథ్యంలో, చిన్నజీయర్ స్వామి ఈ సాయంత్రం మీడియా ముందుకు వచ్చారు. ఈ వివాదం పట్ల వివరణ ఇచ్చారు. 

"ఇవాళ లక్ష్మీ దేవి పుట్టినరోజు. పాలసముద్రంలో ఉద్భవించి భగవంతుడి వద్దకు చేరిన రోజు. నేడు అంతర్జాతీయ వైదిక మహిళా దినోత్సవమని చెప్పాలి. మహిళ అంటే శక్తికి కేంద్రం. మన సంస్కృతిలో మొదట మాతృదేవోభవ అని చెబుతాం. జ్ఞానం చూసి ఆరాధించాలని చెప్పింది రామానుజాచార్యుల వారు. జ్ఞానం చూసి పలువురు దళితులకు ఆరాధర్యస్థానం ఇచ్చారు. అలాంటి రామానుజుల వారి పరంపరగా మేము వచ్చాం. జ్ఞానంలో ఉన్నతులైన హరిజనులు, గిరిజనులకు ఆరాధ్య స్థానం కల్పించాం. ఆదిలాబాద్ గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు ఏర్పాటు చేశాం. రామానుజుల వారి స్ఫూర్తిని కొనసాగించాలన్నదే మా అభిమతం. అందులో భాగంగానే భాగ్యనగరంలో సమతామూర్తి విగ్రహం ఏర్పాటు చేశాం. 

గత కొన్నిరోజులుగా వివాదాలు తలెత్తాయి. అవి సబబేనా, కాదా అనే విచక్షణను వినేవాళ్లకే వదిలేస్తున్నాం. ఆదివాసీలు ఉన్నతస్థాయికి ఎదగాలని కోరుకునే మేం వారిని చిన్నచూపు ఎలా చూస్తాం? స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ అనేది మా నినాదం. మనకు నచ్చింది మనం ఆరాధించుకోవడం, అదే సమయంలో ఇతరుల భావాలను గౌరవించడం ఈ నినాదం వెనుక ఉద్దేశం. ఒక మాట విన్నప్పుడు, ఒక నిర్ణయం చేసేటప్పుడు ముందూ వెనుకలు చాలా ముఖ్యం. అలాకాకుండా మధ్యలోంచి ఒక మాటను బయటికి తీసి ఈ వ్యక్తి ఇలా అన్నాడు అని  అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. 

ఓసారి భాగవత సదస్సు జరుగుతోంది. చాలామంది హాజరయ్యారు. ఒకాయన వేదికపైకి వచ్చి భగవంతుడు లేడని భాగవతం చెబుతోంది అన్నాడు. దాంతో ఆ సదస్సుకు వచ్చినవాళ్లు విస్తుపోయారు. ఆయన చెప్పినట్టు భగవంతుడు లేడనే అంశం భాగవతంలో ఉంది. అయితే అది ఎవరు ఎవరితో చెప్పారనేది చాలా ముఖ్యం. భగవంతుడు లేడు అనే మాటను హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో అన్నాడు. కానీ దీని పూర్వాపరాలు తెలుసుకోకుండా భగవంతుడు లేడు అనే మాటను నిజం నిర్ధారించలేం. ఇప్పుడు తలెత్తిన వివాదానికి కూడా పై ఉదాహరణ వర్తిస్తుంది. 

మేం కూడా ఆదివాసీ దేవతలను ఏదో అన్నామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ విధంగా మేం ఎప్పుడూ వ్యాఖ్యానించడం జరగదు. మేం చేసిన వ్యాఖ్యలకు ముందు వెనుక కూడా ఏముందో చూడాలి. 20 ఏళ్ల కిందట మేం ఏదో అన్నట్టుగా చెబుతున్నారు. మేం గ్రామదేవతలను తూలనాడినట్లు, మా మాటలు ఆదివాసీలకు అవమానకరం అని భావిస్తున్నారు. ఆ విధంగా మేం గ్రామదేవతలను ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. ఆదివాసీల కోసం మా వికాస తరంగిణి సేవా సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. 

ఇప్పుడు రేకెత్తిస్తున్న వివాదం వెనుక కారణాలు ఏంటన్నది ప్రచారం చేసే వాళ్ల విచక్షణకే వదిలేస్తున్నాం. ఉక్రెయిన్ హడావిడి కొంచెం తగ్గింది కాబట్టే మా విషయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారేమో. కొందరు అల్ప ప్రచారం కోసం కెమెరాల ముందుకొచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారు. అమాయకులైన ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మాటల వల్ల సామాజిక ప్రయోజనం ఏమీ లేదు. అది ఆరోగ్యకరం కూడా కాదు" అని చిన్నజీయర్ స్వామి స్పష్టం చేశారు.

More Telugu News