Afghanistan: రండి, ఎంబసీ ఓపెన్ చేయండి.. భద్రతకు మాది పూచీ: భారత్ కు తాలిబన్ల విజ్ఞప్తి

  • ద్వైపాక్షిక సంబంధాలకు ముఖ్యమని వెల్లడి
  • అంతర్జాతీయ గుర్తింపునకూ కీలకమని వ్యాఖ్యలు
  • సురక్షితమైన వాతావరణం కల్పిస్తామని హామీ
  • మిగతా దేశాలూ ఓపెన్ చేయాలని విజ్ఞప్తి
We Ensure Safety If India Opens Embassy In Kabul Requests Talibans

అమెరికా నేతృత్వంలోని నాటో దళాలు ఆఫ్ఘన్ నుంచి వైదొలిగాక.. అంతర్జాతీయంగా ఆఫ్ఘనిస్థాన్ ను ప్రపంచ దేశాలు ఒంటరిని చేయడం, తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించకపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అప్పుడు ఎన్ని హృదయ విధారక ఘటనలు జరిగాయో తెలిసిందే. 

అయితే, ప్రపంచం దూరంగా ఉన్నా.. భారత్ మాత్రం ఆ దేశానికి ఆపన్న హస్తం అందించింది. తిండి లేక అలమటించిపోతున్న వారికి సాయం చేయాలన్న ఉద్దేశంతో 50 వేల టన్నుల గోధుమలను పంపిస్తోంది. ఇప్పటికే 8 వేల టన్నులను 4 షిప్ మెంట్లలో పంపించింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయంగా తమ ప్రభుత్వానికి గుర్తింపు దక్కించుకోవడంలో భాగంగా.. భారత్ వైపు తాలిబన్లు చూస్తున్నారు. 

తాజాగా ఆఫ్ఘనిస్థాన్ లో రాయబార కార్యాలయం ఏర్పాటు చేయాల్సిందిగా భారత్ ను తాలిబన్ పాలకులు కోరారు. ఐక్యరాజ్యసమితికి తాలిబన్ రాయబారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సుహైల్ షాహీన్.. ఎంబసీ పెట్టాలంటూ భారత్ కు విజ్ఞప్తి చేశారు. అందుకు కాబూల్ లో తగిన భద్రతను తాము కల్పిస్తామని, అది తమ పూచీ అని హామీ ఇచ్చారు.  

‘‘భారత్ తో పాటు ఇదివరకు కాబూల్ లో రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేసి.. ఇటీవల మూసేసిన దేశాలన్నీ తిరిగి ఎంబసీలను ఓపెన్ చేయాలన్నదే మా విజ్ఞప్తి. ఇంతకుముందు కార్యకలాపాలను ఎలా నిర్వహించారో ఇప్పుడూ అలాగే సాధారణంగా నిర్వహించుకునేలా మేం తగిన సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తాం’’ అని పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలంటే తమకు రాయబార కార్యాలయాలు ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు.  

కాగా, ఆఫ్ఘనిస్థాన్ కు రోడ్డు మార్గంలో గోధుమలను పంపించేందుకు అటారీ–వాఘా సరిహద్దును భారత్ వినియోగించుకుంటోంది. అందుకు పాకిస్థాన్ కూడా ఒప్పుకొంది. 2007 తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని పాక్ వాడుకోనివ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం.

More Telugu News