RRR: 'ఆర్ఆర్ఆర్' కు గుడ్ న్యూస్... టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి

  • ఈ నెల 25న వస్తున్న ఆర్ఆర్ఆర్
  • ఇటీవల సీఎం జగన్ ను కలిసిన రాజమౌళి, దానయ్య
  • టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి
  • జీవో ప్రకారం అనుమతి మంజూరు
AP govt gives nod to RRR to hike ticket prices

ఏపీ ప్రభుత్వం 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందానికి శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 'ఆర్ఆర్ఆర్' సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇంతకుముందు మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, పారితోషికాలు కాకుండా వంద కోట్ల బడ్జెట్ దాటిన చిత్రాలు టికెట్ రేట్లు పెంచుకోవడంపై దరఖాస్తు చేసుకుంటే కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఈ క్రమంలో 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం కూడా ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపైనే ప్రభుత్వం తాజా నిర్ణయం వెలువరించింది. 

ఇటీవల కొత్తగా తెచ్చిన జీవో ప్రకారం టికెట్ రేటుపై అదనంగా రూ.75 వరకు పెంచుకునేందుకు అనుమతించింది. సినిమా విడుదలైన మొదటి 10 రోజులు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఇటీవల 'ఆర్ఆర్ఆర్' చిత్ర దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య ఏపీ సీఎం జగన్ ను కలిశారు. వారు ప్రధానంగా టికెట్ రేట్ల అంశాన్నే చర్చించినట్టు తెలిసింది. 'ఆర్ఆర్ఆర్' భారీ బడ్జెట్ చిత్రమని, విడుదలైన తర్వాత కొన్నిరోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. 

ఈ అంశంపై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ, 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి రూ.336 కోట్ల బడ్జెట్ అయిందని దర్శకనిర్మాతలు ప్రభుత్వానికి తెలిపారని వెల్లడించారు. అందుకే జీవో ప్రకారం... మొదటి 10 రోజుల టికెట్ ధరలు పెంచుకునేందుకు 'ఆర్ఆర్ఆర్' కు అనుమతి ఇస్తున్నామని తెలిపారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపుదిద్దుకున్న 'ఆర్ఆర్ఆర్' ఈ నెల 25న విడుదల కానుంది.

More Telugu News