'గని' వెనుక సినిమా కష్టాలున్నాయ్: అల్లు అరవింద్

17-03-2022 Thu 18:01
  • 'గని' కథ నాకు నచ్చింది 
  • బాక్సింగ్ వెనుక బలమైన ఎమోషన్స్ ఉంటాయి 
  • కరోనా చాలా ఇబ్బంది పెట్టింది 
  • ఏప్రిల్ 8న వస్తుందన్న అల్లు అరవింద్
Ghani movie update
వరుణ్ తేజ్ కథానాయకుడిగా 'గని' సినిమా రూపొందింది. అల్లు బాబీ - సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేయనున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను వదిలారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ మాట్లాడారు.

"బాక్సింగ్ నేపథ్యంలో సినిమా చేస్తున్నట్టు అల్లు బాబీ చెప్పగానే ఆలోచనలో పడ్డాను. కానీ కిరణ్ కథ చెప్పిన తరువాత నాకు సంతృప్తి కలిగింది. ఈ సినిమాలో బాక్సింగ్ ఉంటుంది .. దాని వెనుక బలమైన ఎమోషన్స్ ఉంటాయి. అందువలన ఇది యూత్ మాత్రమే కాదు .. ఫ్యామిలీ ఆడియన్స్ చూడవలసిన సినిమా.

ఒక మంచి ఉద్దేశంతో సినిమా తీయాలనీ .. కిరణ్ ను దర్శకుడిగా పరిచయం చేయాలని అల్లు బాబీ రంగంలోకి దిగాడు. కానీ కరోనా మన చేతిలో ఉండదు కదా. సినిమా కష్టాలని అంటారే .. ఆ కష్టాలన్నీ ఈ సినిమా కోసం పడ్డారు. చివరికి మంచి అవుట్ పుట్ తీసుకొచ్చారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కొడుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చారు.