KTR: మత పిచ్చి తప్ప... ప్రజా సంక్షేమ పనులు ఒక్కటైనా చేశారా?: బండి సంజయ్ పై కేటీఆర్ ఫైర్

  • బీజేపీ నేతలపై కేటీఆర్ విమర్శనాస్త్రాలు
  • కరీంనగర్ లో బండి సంజయ్ ఏంచేశారో చెప్పాలన్న కేటీఆర్
  • నిత్యం విషం చిమ్ముతున్నారంటూ వ్యాఖ్యలు
KTR fires on Bandi Sanjay

తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరీంనగర్ లో బండి సంజయ్ ఏంచేశారో చెప్పాలని నిలదీశారు. అదే సమయంతో తమ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కేటీఆర్ వివరించారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం వృద్ధులకు ఆత్మగౌరవాన్ని కల్పించిందని అన్నారు. వృద్ధాప్య పెన్షన్లను ప్రభుత్వం రూ.2 వేలకు పెంచిందని చెప్పారు. రాష్ట్రంలో 4.20 లక్షల మంది బీడీ కార్మికులకు ఆర్థికసాయం చేస్తున్నట్టు వెల్లడించారు. బీడీ కార్మికులకు రూ.2,016 చొప్పున ఆర్థికసాయం అందజేస్తున్నట్టు కేటీఆర్ వివరించారు. లక్ష మందికి పైగా ఒంటరి మహిళలకు రూ.2,106 చొప్పున పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. దివ్యాంగులకు రూ.3,016 చొప్పున పెన్షన్ అందజేస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి 57 ఏళ్ల వయస్కులకు పెన్షన్లు అందిస్తామని అన్నారు. 

ఈ ఏడాది మానేరు రివర్ ఫ్రంట్ లోనే బతుకమ్మ ఆడాలని ఆకాంక్షిస్తున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. కుటుంబాలతో వన భోజనాలకు వచ్చేలా మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి జరగాలని స్పష్టం చేశారు. కరీంనగర్ లో రూ.615 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, కరీంనగర్ లో 1,600 డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించామని చెప్పారు. ఉగాది తర్వాత 600 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇంటి స్థలం ఉంటే రూ.3 లక్షల సాయం ఇవ్వనున్నట్టు వివరించారు. ఒక్కో నియోజకవర్గానికి 3 వేల ఇళ్ల చొప్పున మంజూరు చేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. 

ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై ధ్వజమెత్తారు. కరీంనగర్ లో బండి సంజయ్ ఏమైనా పనులు చేశారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర సర్కారు పెద్ద ఎత్తున పనులు చేస్తుంటే మీరేం చేశారని నిలదీశారు. మెగా పవర్ లూమ్ క్లస్టర్ కోరితే కేంద్రం మొండిచేయి చూపిందని కేటీఆర్ ఆరోపించారు. 

"కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని బండి సంజయ్ ఎప్పుడైనా అడిగారా? మెడికల్ కాలేజి, ట్రిపుల్ ఐటీ సంస్థలు తీసుకువచ్చారా? నేదునూరులో విద్యుత్ కేంద్రం ఏమైనా తీసుకువచ్చారా? మత పిచ్చి తప్ప ప్రజా సంక్షేమ పనులు ఒక్కటైనా చేశారా? అని ఆగ్రహం వెలిబుచ్చారు. నిత్యం విషం చిమ్మడమే రాజకీయం కాదని బండి సంజయ్ కు ఈ సందర్భంగా హితవు పలికారు. మేం ఒక్క రూపాయి ఇస్తే కేంద్రం తరఫున మీరు 4 రూపాయిలు ఇవ్వాలి. సంక్షేమ ఫలాలు అందించి ప్రజల మనసు గెలవాలి" అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News