Union health minister: కరోనా పట్ల అప్రమత్తంగా ఉండండి.. కొత్త వేరియంట్లను గుర్తించండి.. అధికారులకు కేంద్రం ఆదేశాలు

  • కేంద్ర మంత్రి మాండవీయ ఉన్నతస్థాయి సమీక్ష
  • పెద్ద ఎత్తున జీనోమ్ సీక్వెన్సింగ్ అమలు చేయాలి
  • కొత్త వేరియంట్, వేవ్ లను ముందే పసిగట్టాలి
  • స్థానికంగా నిఘా అమలు చేయాలంటూ ఆదేశించిన మంత్రి
Union health minister chairs high level meeting on covid situation

ఆసియా దేశాల్లో కరోనా కొత్త కేసులు పెరుగుతుండడం పట్ల భారత సర్కారు అప్రమత్తం అయింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనుసుఖ్ మాండవీయ ఉన్నతాధికారులు, నిపుణులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ బృందం కూడా ఇందులో పాల్గొంది.

దేశంలో కరోనా పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండేలా చూడాలని మంత్రి వారిని కోరారు.  చైనా, దక్షిణ కొరియా, సింగపూర్, కొన్ని ఐరోపా దేశాల్లో కరోనా కొత్త వేవ్ వెలుగు చూస్తున్న తరుణంలో కేంద్ర సర్కారు పరిస్థితిని చాలా క్షుణంగా పర్యవేక్షిస్తోంది. కరోనా ఒమిక్రాన్ కేసులు గరిష్ఠాల నుంచి తగ్గుముఖం పట్టిన తర్వాత నిర్వహించిన తొలి సమీక్ష ఇదే. 

జీనోమ్ సీక్వెన్సింగ్ (వైరస్ రకాన్ని గుర్తించే పరీక్ష)ను పెద్ద ఎత్తున చేపట్టాలని, తద్వారా కొత్త వేరియంట్ల వ్యాప్తిని ముందుగానే గుర్తించాలని అధికారులను మంత్రి మాండవీయ కోరారు. కేసుల హాట్ స్పాట్ లను ముందే గుర్తించేందుకు స్థానికంగా నిఘాను పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ హెడ్ వీకే పాల్, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, ఐసీఎంఆర్ చీఫ్ డాక్టర్ బలరామ్ భార్గవ, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కే విజయ్ రాఘవన్ తదితరులు పాల్గొన్నారు. 

మనదేశంలో కొత్త కేసులు 3,000 లోపునకు పడిపోవడం తెలిసిందే. ఇప్పటి వరకు మరో కొత్త వేరియంట్ కానీ, కొత్త వేవ్ కానీ మన దేశంలో మొదలైన ఆనవాళ్లు, ఆధారాల్లేవు. కాకపోతే జులై నాటికి నాలుగో వేవ్ మొదలవుతుందంటూ ఐఐటీ ఖరగ్ పూర్ శాస్త్రవేత్తలు ఇప్పటికే ఒక అంచనాను ప్రకటించారు.

More Telugu News