Hyderabad: వ్యక్తిగత జీవితబీమా భద్రత హైదరాబాదులో తక్కువే!.. మెట్రో నగరాలపై తాజా సర్వే

Hyderabad least financially protected city
  • ప్రొటెక్షన్ క్వొటెంట్ 48గా నమోదు
  • ఢిల్లీ, బెంగళూరులో ఇది 56
  • టర్మ్ ఇన్సూరెన్స్ పై అవగాహన మెరుగు
  • అయినా తీసుకున్న వారు 41 శాతమే
  • మ్యాక్స్ లైఫ్ సర్వేలో వెల్లడి

మెట్రో నగరాల్లో వ్యక్తిగత ఇన్సూరెన్స్ భద్రత హైదరాబాద్ లో తక్కువగా ఉందని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. హైదరాబాద్ లో ఆర్థిక భద్రతను సూచించే ‘ప్రొటెక్షన్ క్వొటెంట్’ 48గా ఉంటే.. దేశంలోని మెట్రో నగరాలన్నింటిలోకి సగటు ప్రొటెక్షన్ క్వొటెంట్ 53గా ఉందని మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన సర్వేలో తేలింది.  

ఢిల్లీ, బెంగళూరు ఆర్థిక రక్షణ విషయంలో ముందున్నాయి. ఇక్కడ ప్రొటెక్షన్ క్వొటెంట్ 56గా నమోదైంది.  ముంబైలో 55, కోల్ కతా, చెన్నై నగరాల్లో 52 నమోదైంది. 2021 డిసెంబర్ నుంచి 2022 జనవరి మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 5,729 మంది అభిప్రాయాలు తెలుసుకుని ఫలితాలను విశ్లేషించారు. 

‘‘హైదరాబాద్ లో ఆర్థిక భద్రతకు సంబంధించి బలమైన స్పృహ ఉంది. అయితే చురుకైన ఆర్థిక ప్రణాళిక, జీవిత బీమా పట్ల అవగాహన ఇంకా ఎంతో పెరగాల్సి ఉంది. హైదరాబాద్ కు సంబంధించి ఈ అంతరాన్ని పూడ్చాల్సి ఉంది. జీవిత బీమా అన్నది మీరు ప్రేమించే వారికి ఆర్థిక భరోసానిస్తుందన్న విషయమై మరింత ప్రోత్సహించాల్సి ఉంది’’ అని మ్యాక్స్ లైఫ్ డిప్యూటీ ఎండీ విశ్వానంద్ తెలిపారు. 

టర్మ్ ఇన్సూరెన్స్ పట్ల హైదరాబాదీల్లో 79 శాతం మందికి అవగాహన ఉన్నా, కేవలం 41 శాతమే టర్మ్ ఇన్సూరెన్స్ కలిగి ఉన్నట్టు తెలిసింది. అదే బెంగళూరులో 59 శాతం, ముంబైలో 50 శాతం, చెన్నైలో 48 శాతం, ఢిల్లీలో 47 శాతం మందికి టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. 

  • Loading...

More Telugu News