Sunil Gavaskar: కుంబ్లే రికార్డును బద్దలు కొట్టే సత్తా అతడికే ఉంది: గవాస్కర్

Gavaskar says Ashwin can reach Kumble record
  • శ్రీలంకతో టెస్టు సిరీస్ లో 12 వికెట్లు తీసిన అశ్విన్
  • 619 వికెట్లతో కుంబ్లే టాప్
  • ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 442 వికెట్లు
  • అశ్విన్ నానాటికీ మెరుగవుతున్నాడన్న గవాస్కర్

టీమిండియా ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో దారుణ ఫలితాలు చవిచూసిన తర్వాత కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో అద్భుతంగా పుంజుకుంది. న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక జట్లపై సిరీస్ విజయాలు సాధించి మాంచి ఊపుమీదుంది. భారత్ విజయాల్లో టీమిండియా ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ముఖ్య భూమిక పోషించాడు. అశ్విన్ ప్రదర్శనల పట్ల భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా సంతృప్తి వ్యక్తం చేశాడు. 

టెస్టుల్లో అనిల్ కుంబ్లే నమోదు చేసిన 619 వికెట్ల రికార్డును బద్దలు కొట్టే సత్తా అశ్విన్ కే ఉందని స్పష్టం చేశాడు. అశ్విన్ ఇప్పటివరకు సాధించిన వికెట్ల సంఖ్యకు కుంబ్లే రికార్డు చాలా దూరంలో ఉన్నప్పటికీ, అశ్విన్ వికెట్ల దాహం చూస్తుంటే ఆ మైలురాయిని కచ్చితంగా అందుకుంటాడనిపిస్తోందని గవాస్కర్ వ్యాఖ్యానించారు. అశ్విన్ శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ లో 12 వికెట్లు తీశాడు. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 442 టెస్టు వికెట్లు ఉన్నాయి. ఇటీవలే అశ్విన్... కపిల్ దేవ్ 434 వికెట్ల రికార్డును కూడా అధిగమించాడు. 

అశ్విన్ నానాటికీ మెరుగవుతుండడం చూస్తుంటే కుంబ్లే రికార్డును చేరుకోవడం ఏమంత కష్టం కాదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. పైగా అశ్విన్ తన ఘనతల పట్ల పొంగిపోయే రకం కాదని, మరో 160 వికెట్లు తీయడం అతడికి సాధ్యమేనని పేర్కొన్నాడు. 

కుంబ్లే భారత్ తరఫున 132 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించి 29.65 సగటుతో 619 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ ఇప్పటివరకు 86 టెస్టులాడి 24.13 సగటుతో 442 వికెట్లు తీశాడు. అయితే అశ్విన్ వయసు ప్రస్తుతం 35 ఏళ్లు. అతడు ఇంకెన్నాళ్లు టీమిండియాలో కొనసాగుతాడన్న దానిపైనే కుంబ్లే రికార్డును అందుకునే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

  • Loading...

More Telugu News