CM KCR: ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులు ఇక్కడే వైద్య విద్య పూర్తిచేసేందుకు ఖర్చును భరిస్తాం: సీఎం కేసీఆర్ ప్రకటన

  • ఉక్రెయిన్ లో కల్లోలభరిత పరిస్థితులు
  • రష్యా దాడులతో అతలాకుతలం
  • తిరిగొచ్చిన భారత విద్యార్థులు
  • 740 మందిని తీసుకొచ్చామన్న కేసీఆర్
CM KCR announces govt will bear all expenses of Ukraine returned medical students

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ అసెంబ్లీలో ఆసక్తికర ప్రకటన చేశారు. ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులు రాష్ట్రంలోనే వైద్య విద్య పూర్తిచేసుకునేలా వారికయ్యే ఖర్చును భరిస్తామని తెలిపారు. ఉక్రెయిన్ లో రష్యా దాడుల కారణంగా 20 వేల మంది వరకు భారత విద్యార్థులు చిక్కుకుపోయారని, ఇప్పటివరకు 740 మంది తెలంగాణ విద్యార్థులను రాష్ట్రానికి తీసుకువచ్చామని కేసీఆర్ చెప్పారు. 

అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "భారత్ లో వైద్య విద్యకు కోటి రూపాయలు ఖర్చవుతుందంటున్నారు. అదే సమయంలో ఉక్రెయిన్ లో రూ.25 లక్షలతోనే వైద్య విద్య పూర్తి చేయొచ్చని చెబుతున్నారు. భారత్ లో అధిక మొత్తాలు చెల్లించలేక ఉక్రెయిన్ వెళితే అక్కడ ప్రస్తుత పరిస్థితులేం బాగాలేవు. ఉక్రెయిన్ మళ్లీ ఎప్పటికి సాధారణ స్థితికి చేరుకుంటుందో చెప్పలేం. అందుకే 740 మంది తెలంగాణ విద్యార్థులు ఇక్కడే వైద్య విద్య పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. వారి చదువుకయ్యే అన్ని ఖర్చులు  ప్రభుత్వమే భరిస్తుంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాం. వారి చదువు దెబ్బతినకూడదన్నదే మా ఆలోచన" అని కేసీఆర్ స్పష్టం చేశారు.

More Telugu News