Ramiz Raja: ఈ అంశంపై నేను గంగూలీతో మాట్లాడతా: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజా

  • భారత్, పాక్ మధ్య రాజకీయ విభేదాలు
  • నిలిచిపోయిన ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లు
  • ఐసీసీ ఈవెంట్లలోనే తలపడుతున్న దాయాదులు
  • నాలుగు దేశాల టోర్నీ ఏర్పాటు చేద్దామంటున్న రమీజ్ రాజా
PCB Chairman Ramiz Raja says he will talk to BCCI Chief Sourav Ganguly

భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లు ఎప్పుడూ సూపర్ హిట్టే. మైదానంలో ఒక్క సీటు ఖాళీగా మిగిలితే ఒట్టు. అంతటి జనరంజక మ్యాచ్ లకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. భారత్, పాక్ మధ్య రాజకీయ విభేదాల కారణంగా కొంతకాలంగా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడంలేదు. ఎప్పుడైనా ఐసీసీ ఈవెంట్ జరిగితే అందులో పోటీ పడడమే తప్ప, భారత్ లో పాకిస్థాన్ గానీ, పాకిస్థాన్ లో భారత్ గానీ పర్యటించడం లేదు. 

ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీర్ రాజా గతంలో ఆసక్తికర ప్రతిపాదన చేశారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా నాలుగు దేశాల టోర్నీ ఏర్పాటు చేసి, అందులో భారత్, పాక్ ఆడేట్టు చేస్తే ఇరుదేశాల క్రికెట్ బోర్డులకు లాభదాయకంగా ఉంటుందని, ప్రేక్షకులకు దాయాదుల సమరాన్ని వీక్షించే భాగ్యం కూడా లభిస్తుందని రమీర్ రాజా పేర్కొన్నారు. 

తాజాగా ఆయన ఇదే అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. నాలుగు దేశాల క్రికెట్ టోర్నీపై తాను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో మాట్లాడతానని చెప్పారు. గంగూలీని ఒప్పించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లు సమీప భవిష్యత్తులో జరిగే సూచనలు కనిపించకపోగా, క్రికెట్ అభిమానులకు దాయాదుల పోరును దూరం చేయడం సబబు కాదని రమీజ్ రాజా అభిప్రాయపడుతున్నారు. 2022 టీ20 టోర్నీలో భారత్-పాక్ జట్లు తలపడే మ్యాచ్ కు టికెట్లు ఒక్కరోజులోనే అమ్ముడైన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

క్రికెట్ పై రాజకీయ ప్రభావం ఉండరాదని భావిస్తున్నానని రమీజ్ రాజా స్పష్టం చేశారు. అవతల బీసీసీఐకి కూడా ఓ క్రికెటరే నాయకత్వం వహిస్తున్నాడని, తామిద్దరికీ రాజకీయ రంగంతో సంబంధం లేదని పేర్కొన్నారు. భవిష్యత్తు చూస్తుంటే, టీ20 లీగ్ లతో హవా కొనసాగుతోందని అన్నారు. ప్రస్తుతం ద్వైపాక్షిక సిరీస్ లపై ఆసక్తి సన్నగిల్లుతోందని, అందులో ఆకర్షణీయ అంశాలు లోపిస్తున్నట్టు ప్రేక్షకులు భావిస్తున్నారని వివరించారు. మున్ముందు ముక్కోణపు టోర్నీలు, నాలుగు దేశాల టోర్నీలకు అత్యధిక ప్రజాదరణ లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

More Telugu News