Bandi Sanjay: ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం... ఇది బీజేపీ విజయం: బండి సంజయ్

  • ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ తీసుకుంటున్నామన్న కేసీఆర్ 
  • ఫీల్డ్ అసిస్టెంట్ల కోసం తాము పోరాడామన్న సంజయ్
  • సీఎంకు లేఖలు కూడా రాశామని స్పష్టీకరణ
Bandi Sanjay said BJP welcomes CM KCR statement on Field Assistants

రెండేళ్ల కిందట తొలగించిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ అసెంబ్లీలో ప్రకటన చేశారు. దీనిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటున్నట్టు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. ఇది బీజేపీ సాధించిన విజయం అని పేర్కొన్నారు. 

ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ గత కొన్నాళ్లుగా బీజేపీ పోరాడుతోందని, ఫీల్డ్ అసిస్టెంట్లకు మద్దతుగా అనేక వేదికలపై వివిధ రూపాల్లో ఉద్యమించామని వివరించారు. ప్రజా సంగ్రామ యాత్రలోనూ ఫీల్డ్ అసిస్టెంట్ల తరఫున గళమెత్తామని, వారి సమస్యలను, ఉద్యోగాలు కోల్పోయి పడుతున్న బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని బండి సంజయ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా, వారిని విధుల్లోకి తీసుకోవాలంటూ గతంలో ముఖ్యమంత్రికి లేఖలు కూడా రాశామని వెల్లడించారు. 

ఫీల్డ్ అసిస్టెంట్ల మాదిరిగానే 12 వేల మంది విద్యా వలంటీర్లను, 22 వేల మంది పాఠశాల పారిశుద్ధ్య కార్మికులను, 1700 మంది స్టాఫ్ నర్సులతో పాటు రాష్ట్ర సర్కారు తొలగించిన కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News