Pranitha: భర్తతో కలిసి 'కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని చూసి కన్నీటి పర్యంతమైన టాలీవుడ్ హీరోయిన్

  • చిన్న సినిమాగా విడుదలైన ది కశ్మీర్ ఫైల్స్
  • దేశవ్యాప్తంగా ప్రకంపనలు
  • సినిమా పూర్తిగా చూసి ఏడ్చేశానన్న ప్రణీత
  • ప్రతి ఒక్కరూ చూడాలని సూచన
Tollywood heroine Pranitha cries after seen The Kashmir Files

ది కశ్మీర్ ఫైల్స్... ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. 90వ దశకం ఆరంభంలో జమ్ముకశ్మీర్ లో కశ్మీరీ పండిట్స్ కుటుంబాలపై జరిగిన దారుణాలను ఈ సినిమాలో చూపించారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, పునీత్ ఇస్సార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. మార్చి 11న ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

కాగా, ఈ ఎమోషనల్ సినిమాపై టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత స్పందించింది. తన భర్తతో కలిసి ఈ సినిమా చూశానని, సినిమా పూర్తయ్యేసరికి తాను, తన భర్త ఏడ్చేశామని వెల్లడించింది. 30 ఏళ్ల కిందట కశ్మీరీ పండిట్స్ ఎదుర్కొన్న సమస్యలను ఈ సినిమాలో ప్రతిభావంతంగా చూపించారని వివరించింది. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా అని ప్రణీత ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొంది.

ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం వాణిజ్య విలువలకు ఆమడదూరంలో ఉండే చిత్రం. ఇందులో వాస్తవికతకే పెద్దపీట వేశారు. 1990లో జరిగిన పరిస్థితులను ఉన్నది ఉన్నట్టు చూపించారు. నాడు జమ్మూకశ్మీర్ లో జరిగిన తీవ్రస్థాయి తిరుగుబాటులో పెద్ద సంఖ్యలో హిందువులు బలయ్యారన్న విషయాన్ని ఈ చిత్రంలో చూపించారు. 

కశ్మీరీ పండిట్ల కుటుంబాలు అన్నీ వదిలేసి కట్టుబట్టలతో వెళ్లిపోయాయి. ఆ దారుణ మారణహోమం లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసింది. ఇప్పుడు ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం ద్వారా వారి జీవితాల్లోని అత్యంత విచారకర ఘట్టాలను స్పృశించారు. 

ఇది చిన్న సినిమాగా తెరకెక్కినప్పటికీ ఏ పెద్ద సినిమాకీ తీసిపోని రీతిలో ప్రజాదరణ పొందుతోంది. అంతేకాదు, వివాదాల తేనెతుట్టెను కూడా ఈ సినిమా కదిలించింది. ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర ప్రదర్శనలు నిలిపివేయాలంటూ కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.

More Telugu News