'భీమ్లానాయక్' ట్రీట్ మెంట్ ఇస్తాన‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్ వార్నింగ్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి కౌంట‌ర్‌

15-03-2022 Tue 13:19
  • ప‌వ‌న్ నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది
  • నా జోలికి వస్తే క్షమించేది లేదు
  • మేము చూస్తూ ఊరుకోబోము, చేతులు ముడుచుకోము
  • కాకినాడలో మ‌మ్మ‌ల్ని ఏమీ చేయ‌లేరన్న ద్వారంపూడి 
Dwarampudi slams pawan
వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అకారణంగా త‌న‌ను పచ్చిబూతులు తిట్టార‌ని, భవిష్యత్తులోనూ ఇలాగే వ్యవహరిస్తే భీమ్లా నాయక్ ట్రీట్ మెంట్ అంటే ఏంటో చూపిస్తాన‌ని నిన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ వార్నింగ్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ ప‌వ‌న్ కు కౌంట‌ర్ ఇచ్చారు. 

ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..  సినిమాలు-రాజకీయాలు అనేవి వేర్వేర‌ని గుర్తించాలని హిత‌వు ప‌లికారు. ఇటువంటి సభలు పెట్టడం, అనంత‌రం దాని ద్వారా వ‌చ్చిన ప‌బ్లిసిటీతో ప్యాకేజీలు మాట్లాడుకోవడం పవన్ క‌ల్యాణ్‌కు అలవాటే అని ఆయ‌న ఆరోపించారు. ఆయ‌న‌ అందరికీ నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంద‌ని ద్వారంపూడి అన్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులు పెట్టుకోకుండా జ‌న‌సేన పోటీ చేయాలని ద్వారంపూడి సవాల్ చేశారు. 
అలా కాకుండా టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పవన్ క‌ల్యాణ్‌కే నష్టమని ఆయ‌న అన్నారు. జనసేన పార్టీలో కొందరు లక్షల రూపాయ‌లు ఖర్చు చేస్తున్నారని, వారు ఎంత‌గా ఖ‌ర్చుచేసిన‌ప్ప‌టికీ వారిని పవన్ క‌ల్యాణ్ తాకట్టు పెడతార‌ని చెప్పారు. పవన్ క‌ల్యాణ్‌ వ్యక్తిగత దూషణలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నార‌ని ద్వారంపూడి విమర్శించారు. 

ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న జోలికి వస్తే క్షమించేది లేదని ఆయ‌న వార్నింగ్ ఇచ్చారు. తాము ప‌వ‌న్ క‌ల్యాణ్ వంటి వారి చ‌ర్య‌ల‌ను చూస్తూ ఊరుకోబోమ‌ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. జ‌న‌సేన‌ నాయకులు, కార్యకర్తలు త‌మ ఇంటిపైకి వస్తే చూస్తూ, చేతులు ముడుచుకుని కూర్చోబోమ‌ని తెలిపారు. తమ‌ను కాకినాడలో ఏమీ చేయ‌లేర‌ని ఆయ‌న అన్నారు.