Pawan Kalyan: ఇప్పటం సభలో పవన్ కల్యాణ్ ఫైనల్ టచ్ ఇదే!

  • ఇప్పటంలో పవన్ రోమాంఛక ప్రసంగం
  • జనసైనికుల్లో స్ఫూర్తి రగిల్చే ప్రయత్నం
  • అహంకారానికి ఆత్మగౌరవానికి పోరు అని వెల్లడి
  • బాలగంగాధర్ తిలక్ కవిత ప్రస్తావన
Pawan Kalyan speech at Ippatam

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగే ప్రసంగం చేశారు. ఆద్యంతం వైసీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. చివరగా కొన్ని మాటలు చెప్పి ప్రసంగాన్ని ముగిస్తున్నానంటూ ఆవేశపూరిత సందేశం వినిపించారు. 

"పొరుగువాడి మంచితనం దుష్టుడి దురహంకారాన్ని రెచ్చగొడుతోంది. పక్కవాడి సౌభాగ్యం బాలిశుడి గుండెల్లో మంటలు రేకెతిస్తోంది. ప్రజల నోళ్లు కొట్టి, ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టి గజదొంగలు రాజులై రారాజులై ఏలుతున్నారు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసిన ఈ కవితాపంక్తులు వర్తమాన వైసీపీ పాలకులకు చాలా సహజంగా వర్తిస్తాయి... కర్ణుడికి కవచ కుండలాల్లాగా అతికినట్టు సరిపోతాయి. బాలిశుడు అంటే మూర్ఖుడు.. నా ఉద్దేశంలో దుర్మార్గుడు అని అర్థం. 

అధికార మదంతో ఒళ్లు బలిసి కొట్టుకుంటున్న వైసీపీ అనబడే మహిషానికి కొమ్ములు విరగ్గొట్టి కింద కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. ఇదే జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభ యొక్క లక్ష్యం, ఉద్దేశం!" అని వ్యాఖ్యానించారు. 

అలాగే, బీజేపీ నేతలు, పెద్దలు రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పారని, ఆ రోడ్ మ్యాప్ ఎప్పుడిస్తారో చెబితే వైసీపీని ఎలా దించాలో తాము చూసుకుంటామని పవన్ స్పష్టం చేశారు. ఈసారి వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదని, పార్టీలు, వ్యక్తిగత లాభాలు వదిలేసి రాష్ట్ర ప్రయోజనాల వద్దకు వచ్చినప్పుడు పొత్తుల గురించి ఆలోచిస్తామని వెల్లడించారు. 

"కూల్చేవాడుంటే కట్టే వాడుంటాడు... విడదీసేవాడుంటే కలిపేవాడుంటాడు... చీకట్లోకి తోసేవాడుంటే వెలుగులోకి లాక్కొచ్చేవాడుంటాడు... తలెగరేసే పాలకుడుంటే ఎగిరి తన్నే పరశురాముడు ఉంటాడు... దోపిడీ చేసే వైసీపీ గూండా గాళ్లు ఉంటే వారి దోపిడీని అడ్డుకునే జనసైనికులు ఉంటారు... వైసీపీది విధ్వంసం జనసేనది వికాసం. వారిది ఆధిపత్యం... మనది ఆత్మగౌరవం. అది అహంకారానికి అడ్డా.... ఇది జనసైనికుల గడ్డ... జై జనసేన" అంటూ పవన్ కల్యాణ్ ప్రసంగం ముగించారు.

More Telugu News