భవిష్యత్తులో ఇలాగే చేస్తే భీమ్లానాయక్ ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తా: ద్వారంపూడి చంద్రశేఖర్ కు పవన్ కల్యాణ్ వార్నింగ్

14-03-2022 Mon 20:54
  • ఇప్పటం సభలో పవన్ ఆవేశం
  • ద్వారంపూడి తనను పచ్చిబూతులు తిట్టాడన్న పవన్ 
  • తాను ఊరుకున్నా జనసైనికులు బాధపడ్డారని వివరణ
  • నిలదీసేందుకు వెళితే దాడులు చేశారని ఆరోపణ
Pawan Kalyan warns YCP MLA Dwarampudi
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటం సభలో ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ధ్వజమెత్తారు.

"వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి గారికి ఓ విషయం చెప్పదలుచుకున్నాను. మీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ అనే వ్యక్తి అకారణంగా నన్ను పచ్చిబూతులు తిట్టాడు. వినకూడని మాటలు అన్నాడు. అయినా నేను ఊరుకున్నాను. కానీ మా జనసైనికులకు కోపాలు వచ్చాయి. పంతం నానాజీ వంటి నేతలకు కోపాలు వచ్చాయి. ఎందుకు ఇలా అన్నావంటూ వారు నిలదీయడానికి వెళితే వారిపై దాడులు చేశారు. నన్ను అన్న మాటలతో నాకు బాధ అనిపించలేదు కానీ, వీర మహిళలు వారు అనిపించుకున్న మాటలు నాకు చెబితే... అయ్యో వీళ్లను ఎందుకు రాజకీయాల్లో దించాను అని బాధపడ్డాను. 

వైవీ సుబ్బారెడ్డి గారూ.. మీరు పెద్దవాళ్లు, విజ్ఞులు... ఇంత గడ్డిపెట్టండి. ఈ సందర్భంగా ద్వారంపూడి చంద్రశేఖర్ కు కూడా చెబుతున్నాం... గతంలో మీ కుటుంబానికి ఎస్పీ డీటీ నాయక్ గారి ట్రీట్ మెంట్ జరిగింది! భవిష్యత్తులో కూడా మీరు ఇలాగే వ్యవహరిస్తే భీమ్లా నాయక్ ట్రీట్ మెంట్ అంటే ఏంటో చూపిస్తా" అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

అలాగే వైశ్య సామాజిక వర్గాన్ని కూడా రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, యానాదులు, ముత్తరాసి, బీసీ సంచార జాతులకు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కు, ఎస్సీ సోదరులకు, అన్ని వర్గాల వారికి అండగా ఉంటానని స్పష్టం చేశారు.