Team India: బెంగళూరు టెస్టులోనూ టీమిండియా జయభేరి... శ్రీలంకపై సిరీస్ క్లీన్ స్వీప్

Team India clean sweeps two tests series against Sri Lanka
  • బెంగళూరులో డే నైట్ టెస్టు
  • పింక్ బాల్ తో ఆడిన టీమిండియా, శ్రీలంక
  • రెండున్నర రోజుల్లోనే ముగిసిన టెస్టు
  • 447 పరుగుల లక్ష్యం
  • 208 పరుగులకు ఆలౌటైన లంక
రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. శ్రీలంకతో బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ డే నైట్ టెస్టులో భారత్ అన్ని రంగాల్లో సత్తా చాటింది. 238 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. 

447 పరుగుల విజయలక్ష్యంతో మూడో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక 208 పరుగులకు ఆలౌట్ అయింది. లంక సారథి దిముత్ కరుణరత్నే (107) సెంచరీ కొట్టినా ప్రయోజనం దక్కలేదు. ఓవర్ నైట్ స్కోరు 28/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక ఓ దశలో సజావుగానే ఆడుతున్నట్టు కనిపించింది. అయితే, 54 పరుగులు చేసిన కుశాల్ మెండిస్ ను అశ్విన్ అవుట్ చేయడంతో లంక పతనం షురూ అయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ ఎవరూ క్రీజులో కుదురుకోకపోవడంతో భారీ ఓటమి తప్పలేదు. 

ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపిగ్గా ఆడిన కరుణరత్నే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అతడిని బుమ్రా బౌల్డ్ చేయగా, ఆ తర్వాత కొద్దిసేపటికే లంక ఇన్నింగ్స్ కు అశ్విన్ తెరదించాడు. అశ్విన్ 4 వికెట్లు తీయగా, బుమ్రా 3, అక్షర్ పటేల్ 2, జడేజా 1 వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.
Team India
Sri Lanka
Test Series
Bengaluru

More Telugu News