USA: రష్యాకు సాయం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది: చైనాకు అమెరికా వార్నింగ్

  • ఉక్రెయిన్ పై దురాక్రమణకు రష్యా దాడులు
  • తీవ్ర ఆంక్షలు విధించిన అమెరికా తదితర దేశాలు
  • చైనాను సాయం కోరిన రష్యా
  • ఘాటుగా స్పందించిన అమెరికా
US warns China if dragon country helps Russia there should be dire consequences

ఉక్రెయిన్ పై 19 రోజులుగా ముమ్మరంగా దాడులు చేస్తున్న రష్యా... తాజాగా చైనాను సాయం కోరడం తెలిసిందే. ఉక్రెయిన్ పై దురాక్రమణకు దిగిన రష్యాపై అమెరికా తదితర పాశ్చాత్య దేశాలు భారీ ఎత్తున ఆంక్షలు విధించాయి. అయితే, ఉక్రెయిన్ పై పోరాటం కీలక దశలో ఉన్న తరుణంలో ఆంక్షల కారణంగా మిలిటరీ సామగ్రి కొరత రష్యాను వేధిస్తోంది. దాంతో మిలిటరీ వ్యవస్థల సామగ్రి అందజేయాలని తన మిత్రదేశం చైనాను రష్యా కోరింది. దీనిపై అమెరికా ఘాటుగా స్పందించింది. 

తమ ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు రష్యాకు ఎవరు సాయపడినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ స్పందిస్తూ... ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాకు చైనా సాయం అందించేందుకు ప్రయత్నిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 

ఈ మేరకు చైనా అధినాయకత్వంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంప్రదింపులు జరుపుతున్నామని, భారీ ఎత్తున ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యా కుదుటపడేందుకు ఎవరు సాయం అందించినా దాన్ని తాము అనుమతించబోమని పేర్కొన్నారు. రష్యాకు ఊరట కలిగించేలా ఆంక్షలను మీరి ఈ ప్రపంచంలో ఏ దేశం వ్యవహరించినా తమ నుంచి కఠిన చర్యలు చవిచూడాల్సి ఉంటుందని వివరించారు.

More Telugu News