Likhita: 9,999 మేకులపై పాదరక్షలు లేకుండా కూచిపూడి నృత్యం.. ఒకేసారి 10 ప్రపంచ రికార్డులు సాధించిన లిఖిత

Likhita Creates 10 world records in Kuchipudi dance
  • హైదరాబాద్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ప్రదర్శన
  • 9 నిమిషాలపాటు ఏకధాటిగా నృత్యం
  • అమ్మవారిని స్తుతిస్తూ సాగిన ప్రదర్శన
9,999 మేకులపై పాదరక్షలు లేకుండా ఏకధాటిగా 9 నిమిషాలపాటు నృత్యం చేసిన యువ నర్తకి పీసపాటి లిఖిత ఒకేసారి 10 ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళామందిరంలో వరల్డ్ రికార్డ్స్, భారత్ వరల్డ్ రికార్డ్స్, టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ట్రెడిషనల్ వరల్డ్ రికార్డ్స్, వండర్ ఇండియా రికార్డ్స్, ఢిల్లీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, సంస్కృతి సంప్రదాయ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, సకల కళాకారుల ప్రపంచ పుస్తకం, ఎక్స్‌ట్రాడినరీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ప్రైడ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం లిఖిత కూచిపూడి నృత్యం చేసింది. 

అవనీ నృత్యాలయం ఆధ్వర్యంలో ఐఎస్‌కే విజేందర్, ఎ.ధనలక్ష్మి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకోసం లిఖిత నవదుర్గ అంశంతో అమ్మవారిని స్తుతిస్తూ తీర్చిదిద్దిన 9 శ్లోకాలకు మేకులపై లయబద్ధంగా నర్తించి పలు రికార్డులు సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ.. ఒకేసారి పది రికార్డులు సాధించిన లిఖిత కారణజన్మురాలని కొనియాడారు. అనంతరం ఆయా రికార్డుల ప్రతినిధులు లిఖితకు రికార్డుల ధ్రువపత్రాలను అందించి సత్కరించారు.
Likhita
Kuchipudi
Hyderabad
World Records

More Telugu News