RRR: భారత్ లో ఈ టెక్నాలజీతో విడుదలవుతున్న తొలి చిత్రం 'ఆర్ఆర్ఆర్'

RRR will be released with Dolby Cinema format
  • భారీ విలువలతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్
  • అత్యంత శ్రద్ధగా చెక్కిన రాజమౌళి
  • ఆర్ఆర్ఆర్ కోసం డాల్బీ సినిమా టెక్నాలజీ
  • డాల్బీ విజన్+డాల్బీ అట్మోస్= డాల్బీ సినిమా
దర్శక ధీరుడు రాజమౌళి తీసే ప్రతి చిత్రం భారీతనంతో అలరారుతుంటుంది. తారాగణం పరంగా చూసినా, కథా పరంగానూ, సాంకేతిక విలువల రీత్యా తన సినిమా అత్యున్నతస్థాయిలో ఉండేందుకు జక్కన్న విపరీతంగా శ్రమిస్తాడు. అందుకే ఆయన తీసే ప్రతి చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుంటుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంపైనా ఇవే అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రంపై ఆయన అత్యంత శ్రద్ధ చూపిస్తున్నారు. 

ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించేందుకు వీలుగా సరికొత్త టెక్నాలజీ జోడించారు. ఆర్ఆర్ఆర్ చిత్రం డాల్బీ సినిమా ఫార్మాట్ లో విడుదల కానుంది. సాధారణంగా డాల్బీ ల్యాబరేటరీస్ వారు అత్యంత స్పష్టమైన ధ్వని నాణ్యతకు పేరుగాంచారు. ఇప్పటివరకు డాల్బీ డిజిటల్, డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ అట్మోస్ వంటి సౌండ్ ఫార్మాట్లు వచ్చాయి. దాంతో పాటు డాల్బీ సంస్థ డాల్బీ విజన్ పేరిట దృశ్య నాణ్యతను మెరుగపర్చే టెక్నాలజీని కూడా తీసుకువచ్చింది. ఈ క్రమంలో డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ లను కలిపి 'డాల్బీ సినిమా'గా కొత్త ఫార్మాట్ ను అభివృద్ధి చేసింది. 

ఇప్పుడీ 'డాల్బీ సినిమా' ఫార్మాట్ ను ఆర్ఆర్ఆర్ కోసం వినియోగించారు. ఈ సరికొత్త ఫార్మాట్ లో భారత్ లో విడుదలవుతున్న తొలి చిత్రం ఆర్ఆర్ఆర్ కావడం విశేషం. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ట్విట్టర్ లో వెల్లడించింది. 'డాల్బీ సినిమా' ఫార్మాట్ లో రూపొందిన చిత్రాలు ఐమాక్స్, సినీ మార్క్స్, ఎక్స్ డీ, ఆర్పీఎక్స్ వంటి భారీ తెరలపై ప్రదర్శించేందుకు అనువుగా ఉంటాయి. 

కాగా, ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని బ్రిటన్ లోని ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ పై ప్రదర్శించబోతున్నారు. 'డాల్బీ సినిమా' ఫార్మాట్ లో ఆ భారీ స్క్రీన్ పై ఆర్ఆర్ఆర్ విశ్వరూపాన్ని అభిమానులు కనులారా తిలకించనున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం మార్చి 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
RRR
Dolby Cinema
New Format
India
Rajamouli
Ramcharan
NTR
Tollywood

More Telugu News