iran: ఇరాక్​లోని అమెరికా కాన్సులేట్​పై 12 మిస్సైళ్ల‌తో దాడి

  • రాకెట్లు ఢీకొట్టటం వల్ల స్వల్పంగా ధ్వంసం
  • ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్న‌ అధికారులు
  • ఇరాన్ నుంచి సుమారు 12 మిసైల్స్ ప్రయోగం
iran attacks in araq

ఇరాన్ నుంచి ఇరాక్ ఉత్తర ప్రాంత నగరం ఇర్బిల్లోని అమెరికా రాయబార కార్యాల‌యంపై గ‌త అర్ధ‌రాత్రి 12 క్షిప‌ణుల‌తో దాడి జరిగింది. పలు క్షిపణులు దౌత్య కార్యాలయ భవనానికి తాకాయని అధికారులు తెలిపారు. అయితే, ఈ దాడి కార‌ణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని వివ‌రించారు. ఈ మేర‌కు ఇరాక్, అమెరికా భద్రతా అధికారులు ఓ ప్ర‌క‌ట‌న చేశారు. 

ఇర్బిల్లోని సలాహ్ అల్ దిన్ ప్రాంతంలో ఆ కార్యాల‌యం ఉంటుంద‌ని, దాని ప‌క్క‌నే కుర్దిస్థాన్ 24 టీవీ స్టేషన్ ఉంటుంద‌ని ఇరాక్ అధికారులు తెలిపారు. పేలుళ్ల వ‌ల్ల ఆ టీవీ ఛానల్, కాన్సులేట్ భవనం కిటికీలు, ఇతర సామగ్రి మాత్రమే ధ్వంసమయ్యాయని వివ‌రించారు. అక్క‌డే ఉండే ఇర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఎలాంటి ప్రభావం ప‌డలేద‌ని, ఒక్క విమానం కూడా రద్దు కాలేదని తెలిపారు. 

ఇరాన్ నుంచే ఈ క్షిప‌ణుల‌ను ప్రయోగించినట్లు తెలిపారు. అమెరికా జవాన్లలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆ దేశ భ‌ద్ర‌తా అధికారి చెప్పారు. క్షిప‌ణులు ఎక్కడెక్క‌డ ప‌డ్డాయ‌న్న విష‌యంపై వివ‌రాలు తెలియాల్సి ఉంద‌ని తెలిపారు. ఈ బాలిస్టిక్ మిసైల్స్ ను ఇరాన్ ప్ర‌యోగించిన‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే సిరియా, డమస్కస్ లో ఇటీవ‌ల‌ దాడి చేసిన ఇజ్రాయెల్... ఇరాన్ రెవల్యూషనరీ గార్డుకు చెందిన ఇద్దరు సభ్యులను చంపింది. 

ఆ దాడిని ఇటీవ‌లే ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండిస్తూ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ఈ దాడుల‌కు ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పింది. చెప్పిన విధంగానే మిసైల్స్ ప్రయోగం జరగడంతో క‌ల‌క‌లం చెల‌రేగింది అర్ధరాత్రి క్షిపణుల వర్షం కురిపించింది. ఈ ఘ‌ట‌న‌పై అధికారులు విచార‌ణ ప్రారంభించి, వివ‌రాలు తెలుసుకుంటున్నారు.

More Telugu News