Mike Hesson: డూప్లెసిస్ కు కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వడం వెనుక ఆర్సీబీ ఆంతర్యం ఏంటి?

RCB Director of Cricket Mike Hesson reveals reason behind naming Du Plessis as captain over Maxwell Karthik
  • కెప్టెన్ కు మెరుగైన వ్యక్తిని కోరుకున్నాం
  • ఆ విషయంలో ఫాప్ సరైన వాడు
  • అతడికి అన్ని అర్హతలు ఉన్నాయి
  • ఆర్సీబీ డైరెక్టర్ మైక్ హస్సాన్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కొత్త కెప్టెన్ గా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడైన ఫాప్ డుప్లెసిస్ ను ఎంపిక చేసుకుంది. తర్వాతి సీజన్ నుంచి తాను కెప్టెన్ గా ఉండబోనని విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం వల్లే కెప్టెన్సీలో మార్పు చోటు చేసుకుంది. కానీ, జట్టులో మ్యాక్స్ వెల్, దినేష్ కార్తీక్ వంటి అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. వారిని కాదని, ఇటీవలి వేలంలో కొనుగోలు చేసిన డూప్లెసిస్ కు నాయకత్వ పగ్గాలు అప్పగించడం అన్నది అంతా వ్యూహాత్మకంగానే జరిగినట్టు అర్థం చేసుకోవాలి.

డూప్లెసిస్ ను ఎంపిక చేసుకోవడం వెనుక లాజిక్ ను ఆర్సీబీ డైరెక్టర్ మైక్ హస్సాన్ స్వయంగా వెల్లడించారు. కెప్టెన్సీని దృష్టిలో ఉంచుకునే డూప్లెసిస్ ను కొనుగోలు చేశారా? అంటూ మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దీనికి హస్సాన్ బదులిస్తూ.. ‘‘మ్యాక్స్ వెల్ తోపాటు కెప్టెన్సీలో ఎంతో అనుభవం ఉన్న విరాట్ ను మేము అట్టే పెట్టుకున్నాం. నాయకత్వ బృందాన్ని విస్తరించాలని, అందులో హర్షల్ పటేల్ కు కూడా చోటు ఇవ్వాలని భావించాం.  

అందరిలోకి ఫాప్ డూప్లెసిస్ ను ముందుంచి నడిపించాలనుకున్నాం. ఫాప్ ఎంత గౌరవనీయమైన వ్యక్తి అన్నది మాకు తెలుసు. ఆ బాధ్యతకు (కెప్టెన్) సరైన వ్యక్తి అని భావించినప్పుడు భారత ప్లేయరా, లేక విదేశీ ప్లేయరా అని చూడకూడదు. నిబంధనల కింద ఏడుగురు భారత ఆటగాళ్లు, నలుగురు విదేశీయులు ఉంటారు.

ప్రతి గేమ్ ను ఫాప్ చక్కగా ఆడతాడు. కెప్టెన్ బాధ్యత అప్పగించేందుకు మెరుగైన వ్యక్తి కావాలని కోరుకున్నాం. ఆ విషయంలో ఫాప్ సరైన వ్యక్తి అనడంలో సందేహమే లేదు’’అని హస్సాన్ వివరించారు. నిలకడైన రాణింపు, మెరుగైన బ్యాటింగ్ రేటు, చక్కని ఫీల్డింగ్, సుదీర్ఘకాలం పాటు ఐపీఎల్ లో చెన్నై తరఫున ఆడిన అనుభవం ఇవన్నీ ఫాప్ డూప్లెసిస్ కు కలిసొచ్చాయని చెప్పుకోవాలి. చెన్నై జట్టు నాలుగు టైటిల్స్ గెలవగా.. టీమ్ ను ధోనీ నడిపించిన తీరును బాగా తెలిసివాడు డూప్లెసిస్ అనడంలో సందేహమే లేదు.

  • Loading...

More Telugu News