Ukraine: బాంబులు, క్షిపణి మోతలతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్.. భయం గుప్పిట్లో నగరాలు

  • 18వ రోజుకు చేరుకున్న యుద్ధం
  • ఉక్రెయిన్‌కు అందుతున్న ఆయుధ సరఫరాను లక్ష్యంగా చేసుకున్న రష్యా
  • రాజధాని కీవ్‌కు 25 కిలోమీటర్ల దూరంలో రష్యా దళాలు
  • రష్యా రసాయన ఆయుధాలను ఉపయోగించే అవకాశం ఉందన్న నాటో సెక్రటరీ జనరల్
Missile attacks explosions air raid alerts heard across Ukrainian cities

రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం 18వ రోజుకు చేరుకుంది. రోజురోజుకు రష్యా మరింత భీకరంగా దాడులకు దిగుతోంది. ఉక్రెయిన్ నగరాలన్నీ బాంబు, క్షిపణి దాడులతో దద్దరిల్లుతున్నాయి. కాల్పుల విరమణకు అంగీకరిస్తే పుతిన్‌తో తాను చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ పేర్కొన్నారు. రష్యా దురాక్రమణ తర్వాత ఇప్పటి వరకు 1,300 మంది సైనికులు మరణించారని ఉక్రెయిన్ ఆరోపించింది.

రష్యా విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి సెర్గీ ర్యాబ‌కోవ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల ఆయుధాల సరఫరాను తమ సేనలు లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు. కాగా, రష్యా దళాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు ఉపగ్రహాలు చూపిస్తున్నాయి.  

మరోవైపు, ఎల్‌వివ్, ఖేర్సన్ నగరాలపై రష్యా దళాలు బాంబులు, మిసైళ్లతో విరుచుకుపడుతున్నట్టు ‘కీవ్ ఇండిపెండెంట్’ తెలిపింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా రసాయన ఆయుధాలను వినియోగించే అవకాశం ఉందని ఓ జర్మన్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ పేర్కొన్నారు.

More Telugu News