Faf du Plessis: కోహ్లీ స్థానంలో కొత్త కెప్టెన్ ను ప్రకటించిన ఆర్సీబీ

  • ఆర్సీబీ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న కోహ్లీ
  • కొత్త సారథిగా ఫాఫ్ డుప్లెసిస్ ఎంపిక   
  • గతంలో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడిన డుప్లెసిస్
  • వేలంలో రూ.7 కోట్లతో కొనుగోలు చేసిన ఆర్సీబీ
RCB announces Faf du Plessis as new captain

ఐపీఎల్ తాజా సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న నేపథ్యంలో, ఆ జట్టు యాజమాన్యం కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసింది. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ ఇకపై ఆర్సీబీ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ ఆటగాళ్ల మెగా వేలంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ డుప్లెసిస్ ను రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది. 

గత సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన డుప్లెసిస్... ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించడమే కాదు, సుదీర్ఘ ఇన్నింగ్స్ లు ఆడే సత్తా ఉండడం, మెరుపు ఫీల్డింగ్, వ్యూహ చతురత డుప్లెసిస్ ను ప్రత్యేకమైన క్రికెటర్ గా, మెరుగైన సారథిగా మలిచాయి. ఇప్పటిదాకా ఆర్సీబీ జట్టు ఐపీఎల్ లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. కొత్త కెప్టెన్ రాకతో అయినా అదృష్టం కలిసొస్తుందేమోనని బెంగళూరు వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

ఐపీఎల్ 15వ సీజన్ మార్చి 26న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. బెంగళూరు జట్టు టోర్నీలో తన తొలి మ్యాచ్ ను మార్చి 27న పంజాబ్ కింగ్స్ తో ఆడనుంది.

More Telugu News