Team India: టీమిండియా అమ్మాయిల ఆల్ రౌండ్ షో... వరల్డ్ కప్ లో వెస్టిండీస్ పై ఘనవిజయం

Team India women beat West Indies in world cup league match
  • న్యూజిలాండ్ లో ఐసీసీ మహిళల వరల్డ్ కప్
  • హామిల్టన్ లో టీమిండియా వర్సెస్ వెస్టిండీస్
  • 155 పరుగుల తేడాతో టీమిండియా విన్
  • సెంచరీలతో రాణించిన స్మృతి, హర్మన్ ప్రీత్
  • విండీస్ టాపార్డర్ ను దెబ్బతీసిన స్నేహ్ రాణా, మేఘనా 
న్యూజిలాండ్ లో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ లో టీమిండియా అమ్మాయిలు అదరగొట్టారు. వెస్టిండీస్ తో నేడు జరిగిన లీగ్ మ్యాచ్ లో అన్ని రంగాల్లో సత్తా చాటిన భారత జట్టు 155 పరుగుల భారీ విజయం సాధించింది. మొదట స్మృతి మంథన (123), హర్మన్ ప్రీత్ కౌర్ (109)లు బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించగా... ఆపై బౌలింగ్ లో స్నేహ్ రాణా (3 వికెట్లు), మేఘనా సింగ్ (2 వికెట్లు) విండీస్ మహిళల జట్టు వెన్ను విరిచారు. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మహిళలు తొలుత నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 317 పరుగులు చేశారు. స్మృతి మంథన, హర్మన్ ప్రీత్ ల జోరును అడ్డుకోవడానికి విండీస్ జట్టులో 8 మంది బౌలింగ్ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ వీరిద్దరూ సెంచరీల మోత మోగించడంతో భారత్ కు భారీ స్కోరు సాధ్యమైంది. మంథన 119 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 123 పరుగులు చేయగా... హర్మన్ ప్రీత్ 107 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 109 పరుగులు చేసింది. ఓపెనర్ యస్తికా భాటియా 21 బంతుల్లో 6 ఫోర్లతో 31 పరుగులు చేసింది. 

అనంతరం 318 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన వెస్టిండీస్ మహిళల జట్టు ఓ దశలో భారత్ ను భయపెట్టింది. ఓపెనర్లు దియాండ్రా డాటిన్, హేలీ మాథ్యూస్ తొలి వికెట్ కు 100 పరుగులు జోడించి సరైన ఊపు అందించారు. అయితే డాటిన్ 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. స్నేహ్ రాణా కొన్ని ఓవర్ల వ్యవధిలోనే డాటిన్, మాథ్యూస్ లను అవుట్ చేసి విండీస్ పతనాన్ని శాసించింది. ఆపై వచ్చిన బ్యాట్స్ ఉమెన్ ఎవరూ రాణించకపోవడంతో విండీస్ 40.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయింది. 

ఈ వరల్డ్ కప్ టోర్నీలో భారత్ కు ఇది రెండో విజయం. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ పై నెగ్గిన భారత్, రెండో మ్యాచ్ లో ఆతిథ్య న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. కాగా, ఈ టోర్నీలో వెస్టిండీస్ కు ఇది తొలి ఓటమి. వరుసగా రెండు మ్యాచ్ లలో నెగ్గి జోరు మీదున్న విండీస్... హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని విశ్లేషకులు భావించినా టాస్ ఓడిపోవడం ఆ జట్టు అవకాశాలపై ప్రభావం చూపింది. గత రెండు మ్యాచ్ లలోనూ టాస్ విండీస్ నే వరించింది.

ఇక, మార్చి 16న జరిగే తదుపరి లీగ్ మ్యాచ్ లో భారత్ పటిష్ఠమైన ఇంగ్లండ్ ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కు మౌంట్ మాంగనుయ్ లోని బే ఓవల్ మైదానం వేదికగా నిలవనుంది.
Team India
West Indies
League Match
World Cup
Hamilton

More Telugu News