ED: టాలీవుడ్ డ్రగ్స్ కేసును లోతుగా తవ్వుతున్న ఈడీ.. ఎక్సైజ్ కమిషనర్ కు నోటీసు

  • అన్ని రకాల ఆధారాలు ఈడీకి ఇవ్వాలన్న కోర్టు
  • ఇప్పటి వరకు సమాచారం ఇవ్వని ఎక్సైజ్ విభాగం
  • దీంతో కోర్టు ధిక్కార నోటీసు జారీ చేసిన ఈడీ
ED contempt notice to excise official in Tollywood drugs case

టాలీవుడ్ మత్తుమందుల (డ్రగ్స్) కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విభాగం తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కు కోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది. టాలీవుడ్ లో ప్రముఖ నటీనటులు డ్రగ్స్ తీసుకోవడంపై లోగడ ఎక్సైజ్ శాఖ దర్యాప్తు నిర్వహించడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, కాల్ డేటా రికార్డులు, ఎఫ్ఐఆర్ కాపీలు, స్టేట్ మెంట్ లు, వీడియోలు, ఇతర అన్ని రకాల డిజిటల్ ఆధారాలను ఈడీకి ఇవ్వాలని ట్రయల్ కోర్టు లోగడ ఆదేశాలు ఇచ్చింది. 

అన్ని ఆధారాలను 30 రోజుల్లో అందించాలని కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఇంత వరకు వివరాలతో తమ మందుకు రాలేదని ఈడీ కార్యాలయం తెలిపింది. ‘‘కేవలం 12 ఎఫ్ఐఆర్, చార్జ్ షీట్ల కాపీలు ఇప్పటి వరకు ఈడీ డైరెక్టరేట్ కు అందించారు. దర్యాప్తులో భాగంగా సేకరించిన డిజిటల్ సమాచార కాపీలు అందించలేదు’’ అని ఈడీ తరఫు న్యాయవాది నోటీసులో పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ కు చెందిన అగ్ర నటులు, దర్శకుల కాల్ రికార్డులు సైతం సమర్పించాలని ఈడీ కోరింది.

More Telugu News