Team India: సెంచరీలతో విరుచుకుపడిన స్మృతి, హర్మన్‌ప్రీత్.. విండీస్ ఎదుట కొండంత లక్ష్యం

Mandhana and Harmanpreet tons help India post 317 runs for 8 wickets
  • విండీస్ బౌలర్లను ఆటాడుకున్న స్మృతి, హర్మన్
  • విండీస్ ఫీల్డింగ్ కకావికలు
  • కరీబియన్ల ఎదుట 318 పరుగుల లక్ష్యం
ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ దుమ్మురేపింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసి ప్రత్యర్థికి కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ సెంచరీలతో చెలరేగారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 49 పరుగుల వద్ద ధాటిగా ఆడుతున్న యష్తికా భాటియా (31) వికెట్‌ను కోల్పోయింది.  58 పరుగుల వద్ద కెప్టెన్ మిథాలీ రాజ్ (5), 78 పరుగుల వద్ద దీప్తి శర్మ (15) అవుటయ్యారు.

దీంతో జట్టు బాధ్యతను తమ భుజాలపై వేసుకున్న స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ తొలుత సంయమనంతో ఆడారు. క్రీజులో కుదురుకున్న తర్వాత విండీస్ బౌలర్లను ఆటాడుకున్నారు. ఫోర్లతో విరుచుకుపడ్డారు. వీరిద్దరి దెబ్బకు విండీస్ ఫీల్డింగ్ కకావికలైంది.  దొరికిన బంతిని దొరికినట్టుగా బౌండరీలకు పంపిస్తూ పరుగుల వేగం పెంచారు. 

ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న స్మృతి అదే జోరుతో సెంచరీ పూర్తిచేసుకుంది. 108 బంతుల్లోనే ఫోర్ కొట్టి శతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించింది. ఈ క్రమంలో మరో భారీ షాట్‌కు యత్నించి అవుటైంది. మొత్తంగా 119 బంతులు ఎదుర్కొన్న మంధాన 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 123 పరుగులు చేసింది. 

మరోవైపు, హర్మన్ ప్రీత్ కూడా చెలరేగింది. విండీస్ బౌలర్లపై ఫోర్లతో దాడిచేసింది. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న హర్మన్  107 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 109 పరుగులు చేసి వెనుదిరిగింది. స్మృతి అవుటైన తర్వాత భారత్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. అయితే, అప్పటికే స్కోరు 300 పరుగులు దాటింది. చివరికి 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో అనిశా మొహమ్మద్ 2 వికెట్లు తీసుకోగా, షమిలియా, హేలీ మాథ్యూస్, షకేరా సేల్మన్, డియేంద్ర డోటిన్, అలియాష్ అలేనే తలా ఓ వికెట్ తీసుకున్నారు.
Team India
West Indies
ICC Womens World Cup 2022
Smriti Mandhana
Harmanpreet Kaur

More Telugu News