China: ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్నది యుద్ధమేనన్న చైనా... ఎయిర్ లైన్ విడిభాగాల సరఫరాకు నిరాకరణ

  • రష్యాకు మిత్రదేశంగా ఉన్న చైనా
  • వారం కిందటివరకు ఓ బాణీ
  • తమ సంబంధాలు రాక్ సాలిడ్ అని వెల్లడి
  • ఇప్పుడు కొత్త పల్లవి
  • రష్యా దాడులపై తొలిసారి ప్రతికూలంగా స్పందించిన చైనా
China terms Russia military action on Ukraine as War

రష్యాకు మిత్రదేశంగా పేరుగాంచిన చైనా బాణీ మార్చింది. రష్యా-చైనా సంబంధాలు 'రాక్ సాలిడ్' అని వారం కిందట వ్యాఖ్యానించిన చైనా... ఇప్పుడు ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్నది యుద్ధమేనని స్పష్టం చేసింది. రష్యా నిర్ణయం పట్ల చైనా అధినాయకత్వం ప్రతికూల ధోరణిలో స్పందించడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో రష్యాకు ఎయిర్ లైన్ విడిభాగాల సరఫరాకు నిరాకరించింది. 

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పందిస్తూ, త్వరలోనే ఈ యుద్ధం ఆగిపోతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ ఈవ్స్ లె డ్రియాన్ తో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా వాంగ్ యీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు చైనా అధికారిక చానల్ సీసీటీవీ పేర్కొంది. ఈ యుద్ధ సమయంలో అన్ని వర్గాలు సంయమనం పాటించాలని, ఉక్రెయిన్ లో ఉద్రిక్తతలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని వాంగ్ యీ కోరినట్టు సీసీటీవీ పేర్కొంది. 

కాగా, చైనా తమకు విమాన విడిభాగాలు సరఫరా చేసేందుకు నిరాకరించిన విషయాన్ని రష్యా పౌరవిమానయాన సంస్థకు చెందిన ఓ అధికారి సూచన ప్రాయంగా తెలిపారు. చైనా నిర్ణయంతో రష్యా మీడియాలోనూ కథనాలు వచ్చాయి. విమాన విడిభాగాల కోసం రష్యా... తన మిత్రదేశాలైన టర్కీ, భారత్ ల సాయం కోరనుందని ఆ కథనాల్లో పేర్కొన్నారు. ఇప్పటికే యూరప్ దేశాలన్నీ రష్యన్ విమానాలకు తమ గగనతలం మూసేయగా, బోయింగ్, ఎయిర్ బస్ వంటి దిగ్గజ సంస్థలు కూడా విడిభాగాల సరఫరా నిలిపివేశాయి.

More Telugu News