Corona Virus: క‌రోనా కొత్త వేరియంట్ విజృంభ‌ణ‌.. చైనాలో లాక్ డౌన్‌

  • చైనాలో వెలుగులోకి క‌రోనా కొత్త వేరియంట్
  • చాంగ్ చున్ లో వేగంగా విస్త‌ర‌ణ‌
  • న‌గ‌రంలో లాక్ డౌన్‌, క‌ఠిన ఆంక్ష‌లు
corona new variant in china

యావ‌త్తు ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడించిన క‌రోనా వైర‌స్ పుట్టిల్లు అయిన చైనా మ‌రోమారు ఈ వైర‌స్ విజృంభ‌ణ‌తో అల్లాడిపోతోంది. చైనాకు చెందిన ఈశాన్య న‌గ‌రం చాంగ్ చున్‌లో కరోనా కొత్త వేరియంట్ బ‌య‌టప‌డింది. ఈ వేరియంట్ చాలా వేగంగా విస్త‌రిస్తోంద‌ట‌. దీంతో చాంగ్ చున్‌లో చైనా ప్ర‌భుత్వం సంపూర్ణ లాక్ డౌన్‌ను విధించింది. అంతేకాకుండా లాక్ డౌన్‌లో క‌ఠిన ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తోంది. క‌రోనా వైర‌స్ నుంచి ఎలాగోలా బ‌య‌ట‌ప‌డిపోయామంటూ ఊపిరి పీల్చుకుంటున్న దేశాలు ఈ వార్త‌తో ఆందోళ‌న‌కు గుర‌వుతున్నాయి. 

ఇక చాంగ్ చున్‌లో కొత్త వేరియంట్ విస్త‌ర‌ణ‌, అమ‌లు అవుతున్న లాక్ డౌన్ విష‌యానికి వ‌స్తే.. 90 లక్షల జనాభా ఉన్న న‌గ‌రంలో కొత్త వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తోందట‌. దీంతో స్థానికులు ఎవ‌రూ ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావొద్దని అధికారులు ఆంక్షలు పెట్టారు. కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రు మాత్ర‌మే నిత్యావ‌స‌రాల కోసం బ‌య‌ట‌కు వెళ్లాలని సూచించారు. అది కూడా రెండు రోజుల‌కు ఒక‌సారి మాత్రమే బయటకు రావాలని క‌ఠిన ఆంక్ష‌లు విధించార‌ట‌. న‌గ‌రంలోని ప్రతి ఒక్కరూ మూడు సార్లు కరోనా ప‌రీక్షలను చేయించుకోవాలని అధికారులు సూచించారు. అత్యవ‌స‌రం కాని సేవ‌లను ర‌ద్దు చేశారు. ట్రాన్స్‌పోర్ట్ లింకుల‌ను కూడా మూసివేశారు. 

క‌రోనాకు పుట్టిల్లు అయిన చైనాలో ఆదిలో కొంత‌మేర కేసులు అధికంగానే న‌మోదు అయినా.. 2020 మార్చి తర్వాత కేసులు వేగంగా త‌గ్గిపోయాయి. అయితే గత కొన్ని రోజులుగా చైనాలో రోజువారీ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. గ్వాంగ్‌ డాంగ్, జిలిన్, షాన్‌ డాంగ్ ప్రావిన్సులలో మెజారిటీ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. హాంకాంగ్‌లో కూడా భారీగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయట‌. దీంతో ఆయా ప్రాంతాల్లో ప‌రిస్థితికి త‌గ్గ‌ట్లుగా అధికారులు ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్నారు.

More Telugu News