Prashant Kishor: 2024లోనే దేశం కోసం పోరాటం డిసైడ్ అవుతుంది.. రాష్ట్రాల ఎన్నికల్లో కాదు: ప్రశాంత్ కిశోర్

Battle For India will Be Fought and Decided In 2024
  • ఆ విషయం సాహెబ్ కు బాగా తెలుసు
  • ఫలితాలతో ప్రతిపక్షాల మానసిక స్థితిని దెబ్బతీసే ప్రయత్నాలు
  • తప్పుడు వ్యాఖ్యానాలను నమ్మవద్దని ప్రశాంత్ కిశోర్ పిలుపు
భారత్ కోసం పోరాటం భవిష్యత్ లో జరుగుతుందని, ఆ పోరాటం ఏంటనేది 2024లో నిర్ణయమవుతుందని రాజకీయ వ్యూహకర్త  ప్రశాంత్ కిశోర్ అన్నారు. అంతేగానీ ఏదో ఒక రాష్ట్ర ఎన్నికల్లో కాదని చెప్పారు. ఈ విషయం సాహెబ్ కు బాగా తెలుసన్నారు. 

అయితే, ఇప్పుడు వచ్చిన ఎన్నికల ఫలితాలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బ తీసేందుకు లేనిపోని ఘర్షణాత్మక వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. కాబట్టి అలాంటి అసత్య కథనాలు, తప్పుడు వ్యాఖ్యానాలకు ఎవరూ పడిపోవద్దని సూచించారు. 

కాగా, నిన్న వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పంజాబ్ లో ఎవరూ ఊహించని విధంగా ఆప్ 92 స్థానాలు సాధించి పంజాబ్ పై పంజా విసిరింది. 

యూపీలో సీట్లు తగ్గినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే మెజారిటీ స్థానాలను మించి బీజేపీ గెలిచింది. మిత్ర పక్షాల సాయం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేసేలా 255 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. గోవాలో సరిగ్గా సగం సీట్లు సాధించిన కాషాయ పార్టీ.. ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతివ్వడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 

ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వానికి సోషల్ మీడియా వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో కొత్త ఫ్రంట్ ను ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో పీకే వ్యూహాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Prashant Kishor
Election Result

More Telugu News