Russia: 16వ రోజుకు చేరిన యుద్ధం.. ఉక్రెయిన్ పై రష్యా వ్యాక్యూమ్ బాంబులు!

Russia confirms use of vacuum bombs against Ukraine UK
  • తాత్కాలికంగా కాల్పుల విరమణ
  • కీవ్, ఖార్కీవ్, మారిపోల్ నుంచి ప్రజల తరలింపునకు మార్గం
  • జీవాయుధాల అంశంపై చర్చించనున్న భద్రతామండలి
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర 16వ రోజుకు చేరింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ చుట్టూ రష్యా సైన్యాన్ని, ఆయుధాలను మోహరించింది. కాకపోతే మానవతా సాయం కింద సుమీ, కీవ్, ఖార్కీవ్, మారిపోల్ ప్రాంతాల నుంచి ప్రజలు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు కొన్ని మార్గాలు తెరిచేందుకు అనుమతించింది. 

ఈ నేపథ్యంలో ఈ రోజు కాల్పులకు విరామం పలికింది. ప్రజలను తరలించే వాహనాలు, అధికారుల వివరాలు ఇవ్వాలని రష్యా సైన్యం కోరింది. మరోవైపు ఉక్రెయిన్-రష్యా మధ్య నిన్న జరిగిన చర్చలు ఎటువంటి ఫలితం ఇవ్వని విషయం తెలిసిందే.

ఉక్రెయిన్ లో అమెరికా జీవాయుధాలను తయారు చేయిస్తోందన్న రష్యా ఆరోపణలపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నేడు సమావేశం కానుంది. మరోవైపు ఉక్రెయిన్ లో వ్యాక్యూమ్ బాంబులను ప్రయోగిస్తున్నట్టు రష్యా రక్షణ శాఖ ధ్రువీకరించిందంటూ బ్రిటన్ రక్షణ శాఖ ట్వీట్ చేసింది. 

టీవోఎస్-1ఏ అనే సిస్టమ్ థెర్మోబారిక్ రాకెట్లను (వ్యాక్యూమ్ బాంబులు) ప్రయోగించగలదు. రష్యా థెర్మోబారిక్ ఆయుధ వ్యవస్థను తమపై ప్రయోగిస్తున్నట్టు ఉక్రెయిన్ లోగడే ఆరోపించింది. ఈ విషయాన్ని అమెరికాలో ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కరోవా సైతం ప్రకటించారు.
 
వ్యాక్యూమ్ బాంబ్ అంటే?
వ్యాక్యూమ్ బాంబ్ లేదా థెర్మోబారిక్ వెపన్ అన్నది ఒక రకమైన బాంబు. ఇది గాలిలోని ఆక్సిజన్ ను సంగ్రహించి అత్యధిక ఉష్ణోగ్రతతో భారీ పేలుడును సృష్టిస్తుంది. కాకపోతే ఇతర బాంబుల మాదిరిగా కాకుండా ఈ పేలుడు వ్యవధి ఎక్కువ సమయం పాటు ఉంటుంది. దీని తీవ్రత ఎంత ఉంటుందంటే.. మనుషుల శరీరాలను కూడా ఆవిరి చేసేయగలదు.
Russia
vacuum bombs
Ukraine
war

More Telugu News