Russia: ఇక నాటో మాటెత్తబోమన్న జెలెన్ స్కీ... అణుయుద్ధం రాబోదన్న రష్యా

  • ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర
  • 15వ రోజుకు చేరిన దాడులు
  • జైటోమిర్, మేరియుపోల్ నగరాలపై దాడులు
Interesting updates from Russia and Ukraine

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నేటికి 15వ రోజుకు చేరుకుంది. రష్యా దళాలు నేడు జైటోమిర్, మేరియుపోల్ నగరాల్లోని పలు ప్రాంతాలపై దాడులు చేశాయి. తాజా పరిణామాల నేపథ్యంలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ తన పంథా మార్చినట్టు తెలుస్తోంది. 

కాస్తంత వెనుకంజ ధోరణిలో వ్యాఖ్యానిస్తూ, ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకోవాలన్న అంశంపై ఒత్తిడి చేయబోమని జెలెన్ స్కీ తెలిపారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులకు ఈ అంశమే కారణమన్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ గనుక నాటోలో చేరితే, పక్కలో బల్లెంలా మారుతుందని, నాటో దేశాలన్నీ ఉక్రెయిన్ భూభాగం నుంచి తనపై దాడికి దిగే అవకాశాలు ఉంటాయని రష్యా భయపడుతోంది. 

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పందిస్తూ, ఉక్రెయిన్ తో వివాదం అణుయుద్ధానికి దారితీయబోదని అన్నారు. అణుయుద్ధం జరుగుతుందని తాను భావించడం లేదన్నారు. అమెరికా, యూరప్ దేశాల గురించి వ్యాఖ్యానిస్తూ, రష్యా మరోసారి అమెరికా, యూరప్ దేశాలపై ఆధారపడబోదని స్పష్టం చేశారు. అటు, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా టర్కీలో సమావేశం కాగా, ఆ భేటీ వల్ల ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఎవరి వాదనలకు వారు కట్టుబడి ఉండడంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.

More Telugu News