Sharad Pawar: పంజాబ్ రైతులు మోదీపై ఆగ్రహంతో ఉన్నారు... ఎన్నికలతో అది స్పష్టమైంది: శరద్ పవార్

Sharad Pawar opines on Punjab people mandate in assembly elections
  • పంజాబ్ లో ఆప్ ప్రభంజనం
  • 90కి పైగా స్థానాలు చేజిక్కించుకునే దిశగా ఆప్
  • రెండు స్థానాలకే పరిమితమైన బీజేపీ కూటమి
  • ప్రజల ఆగ్రహాన్ని ఎన్నికలు ప్రతిఫలించాయన్న పవార్

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత, సీనియర్ రాజకీయవేత్త శరద్ పవార్ స్పందించారు. పంజాబ్ రైతుల హృదయాల్లో ప్రధాని నరేంద్ర మోదీపై ఆగ్రహం నెలకొందని తెలిపారు. ఆ కోపం ఎన్నికల్లో స్పష్టంగా ప్రతిఫలించిందని అభిప్రాయపడ్డారు. అందుకే పంజాబ్ ప్రజలు బీజేపీని ఓడించారని వ్యాఖ్యానించారు.  

పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ సొంత పార్టీ పెట్టి బీజేపీతో జట్టుకట్టడం కూడా పంజాబ్ ప్రజలకు నచ్చలేదని శరద్ పవార్ పేర్కొన్నారు. పంజాబ్ లో ఆప్ 90కి పైగా స్థానాలు చేజిక్కించుకునే దిశగా పరుగులు తీస్తుండగా, బీజేపీ కూటమి 2 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో, మహారాష్ట్రలో తమ పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికి బీజేపీ మరో రెండున్నరేళ్లు ఆగాల్సి ఉంటుందని అన్నారు. 

ఇక, ఉత్తరప్రదేశ్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభంజనం ముందు అఖిలేశ్ యాదవ్ ప్రభావం కనిపించకపోవడంపైనా పవార్ స్పందించారు. అందులో అఖిలేశ్ తప్పేమీలేదని వివరించారు. సమాజ్ వాదీ పార్టీ సొంతంగానే పోటీ చేసిందని, ఎన్నికల ఫలితాల గురించి అఖిలేశ్ పట్టించుకోవాల్సిన అవసరంలేదని అన్నారు. అఖిలేశ్ జాతీయస్థాయి నేత అని తెలిపారు. గతంలో కంటే మిన్నగా పోరాడాడని కొనియాడారు.

  • Loading...

More Telugu News