Russia: మేం వారికి సహకరించేదే లేదు..మాకు వారి సాయం అవసరం లేదు: రష్యా ఆక్రమించుకున్న నగరాల్లోని పౌరుల ఆవేదన

We are not co operating we dont want their help
  • మెలిటోపోల్, ఖేర్సన్ సహా రష్యన్ సైన్యం అధీనంలో పలు నగరాలు
  • ఇంటర్నెట్ పూర్తిగా బంద్
  • కాల్స్ చేసుకునే వెసులుబాటు లేక అల్లాడిపోతున్న జనం
  • ఉక్రెయిన్‌ను సైన్య రహితం చేయాలన్నదే పుతిన్ ప్రయత్నమన్న మెలిటోపోల్ మేయర్
ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన యుద్ధం 14 రోజులకు చేరుకుంది. మెలిటోపోల్, ఖేర్సన్, బెర్డ్‌యాన్స్క్, స్టారోబిల్క్స్, నోవోపోస్కోవ్ వంటి నగరాలు రష్యా హస్తగతమయ్యాయి. ఇప్పుడీ ప్రాంతాలన్నీ రష్యా దళాల నియంత్రణలో ఉన్నాయి. అయినప్పటికీ ఆయా నగరాల పౌరులు మాత్రం సైన్యాన్ని ప్రతిఘటిస్తూనే ఉన్నారు. దక్షిణ ఉక్రెయిన్ నగరమైన మెలిటోపోల్ లో ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా వాట్సాప్, టెలిగ్రామ్ కాల్స్ కూడా చేసుకునే వెసులుబాటు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. 

ఒకవేళ ఇంటర్నెట్ కనెక్ట్ అయినా కొన్ని నిమిషాలకే అది పరిమితం అవుతోంది. ఇప్పుడు తాము సాధారణ ఫోన్లను ఉపయోగించి ఫోన్లు చేయడం అంత సులభం కాదని, ఎందుకంటే వాటిని (ఫోన్ లైన్స్) రష్యన్లు వినడం చాలా సులభమని మెలిటోపోల్ మేయర్ ఇవాన్ ఫెడెరోవ్ అన్నారు. నగరాన్ని ఆక్రమించిన రష్యన్ దళాలు కమ్యూనికేషన్ వ్యవస్థను తమ అధీనంలోకి తీసుకున్నట్టు చెప్పారు.

రష్యా సేనలు నగరాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఇవాన్, ఆయన బృందం వారం క్రితమే నగరాన్ని విడిచిపెట్టారు. రష్యన్ సేనలకు తాము ఏ రకంగానూ సహకరించబోమని ఫెడరోవ్ తేల్చి చెప్పారు. వారు తమకు సాయం చేసేందుకు ప్రయత్నించడం లేదని, తాము కూడా వారి సాయాన్ని కోరుకోవడం లేదని అన్నారు. 

ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించినప్పుడు తాము ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలనుకోవడం లేదని పుతిన్ అన్నారని ఫెడరోవ్ గుర్తు చేశారు. చూస్తుంటే ఉక్రెయిన్‌ను సైన్య రహితం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉందని అన్నారు. ఉక్రెయిన్‌లో నిస్సైన్యీకరణ, నాజీయిజం లేకుండా చేయడమే లక్ష్యంగా సైనిక చర్య ప్రారంభించాలనుకుంటున్నామని గతంలో పుతిన్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఫెడరోవ్ గుర్తు చేశారు.
Russia
Ukraine
Melitopol
Kherson

More Telugu News