Amara Raja Group: తనిఖీలకు మేం రెడీ.. హైకోర్టుకు చెప్పిన అమర్‌రాజా బ్యాటరీస్

  • ఉద్యోగుల రక్తంలో సీసం పరిమితంగా ఉందని పరీక్షల్లో వెల్లడైంది
  • ఏపీ పీసీబీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా వాస్తవ దూరం
  • విచారణను 11కు వాయిదా వేయాలన్న పీసీబీ
  • ఆ రోజు సంయుక్త తనిఖీ బృందాన్ని నియమిస్తామన్న ధర్మాసనం
  • పదపదే సంస్థకు నోటీసులు ఇవ్వడం సరికాదన్న  కోర్టు
We are ready for Checks amara raja told ap high court

ఫ్యాక్టరీ నుంచి కాలుష్యం విపరీతంగా వెలువడుతోందని, దీంతో పరిశ్రమను మూసివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య మండలి (ఏపీ పీసీబీ) ఇచ్చిన మూసివేత ఉత్తర్వులపై అమర్‌రాజా బ్యాటరీస్ హైకోర్టులో వేసిన పిటిషన్‌ నిన్న విచారణకు వచ్చింది. అమర్‌రాజా తరపున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ఉద్యోగుల రక్తంలో సీసం శాతం పరిమితంగానే ఉన్నట్టు వారికి నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైన విషయాన్ని ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

కర్మాగార వ్యవస్థాపకులు కూడా పరిశ్రమ ప్రాంగణంలోనే ఉంటున్నారని అన్నారు. తమ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున కాలుష్యం విడుదలవుతోందని కాలుష్య నియంత్రణ మండలి చేస్తున్న ఆరోపణలు ఎంతమాత్రమూ సరికాదని, అవి పూర్తిగా వాస్తవ దూరమని అన్నారు. కావాలంటే నిపుణులైన సంయుక్త కమిటీతో తమ సంస్థలో తనిఖీలు చేయించుకోవచ్చని, అందుకు తాము సిద్ధమేనని న్యాయస్థానానికి తెలిపారు.

తనిఖీలపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, తాము కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీ పీసీబీ తాజాగా మరోమారు సంజాయిషీ నోటీసు పంపిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పరిశ్రమ నిర్వహణకు ఇచ్చిన అంగీకారం ఈ నెలతో ముగియనుండడంతో దానిని పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేయాలని ఆదినారాయణరావు కోరారు. 

ఏపీ పీసీబీ తరపు న్యాయవాది సురేందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ తనిఖీల కమిటీకి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వం వహించాలని అన్నారు. ఈ కేసులో తమ సీనియర్ న్యాయవాది ఈ నెల 11న వాదనలు వినిపిస్తారని, అప్పటి వరకు కేసును వాయిదా వేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం 11న విచారణ అనంతరం సంయుక్త తనిఖీ బృందాన్ని నియమిస్తామని పేర్కొంది. అంతేకాదు, విచారణ పెండింగులో ఉండగా పదేపదే షోకాజ్ నోటీసులు ఇవ్వడం సరికాదని పీసీబీకి మొట్టికాయలు వేసింది.

More Telugu News