gold: ప‌సిడి ప‌రుగు ఆగ‌దా?.. ఒక్కరోజులో రూ.1,500 మేర జంప్!

  • రూ.53 వేల మార్కును దాటిన బంగారం
  • రూ.70 వేల‌ను ట‌చ్ చేసిన వెండి
  • ధ‌ర‌ల ప‌రుగుకు యుద్ధ‌మే కార‌ణ‌మ‌ట‌
huge hike in gold rates

సాధార‌ణ ప‌రిస్థితుల్లోనే పుత్త‌డి ప‌రుగు ఓ రేంజిలో సాగుతోంటే.. అక్క‌డ ఉక్రెయిన్‌, ర‌ష్యాల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధం కారణంగా ప‌సిడి ప‌రుగు మ‌రింత మేర వేగం పుంజుకుంది. ఏకంగా ఒక్క రోజులోనే ప‌ది గ్రాముల ధ‌ర‌లో రూ.1,500 మేర పెరుగుద‌ల న‌మోదై కొనుగోలు దారుల‌ను భ‌య‌పెట్టేసింది. ఫ‌లితంగా సోమ‌వారం ప‌సిడి ధ‌ర ఏకంగా రూ.53 వేలు దాటిపోయింది. ఇదే బాట‌లోనే సాగుతున్న వెండి ధ‌ర కూడా కిలోకు ఏకంగా రూ.2 వేల మేర‌ పెరిగింది. 

యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర అమాంతం పెరిగిపోయింది.. సోమ‌వారం స్పాట్ బంగారం ధర ఔన్స్‌కు 1.5 శాతం పెరిగి 1,998.37 డాలర్లకు ఎగబాకింది. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.7 శాతం పెరిగి 2,000.20 డాలర్లకు పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర 1.89 శాతం పెరిగి రూ.53,550 వద్ద ఉంటే, కిలోగ్రాము వెండి ధర 2.35 శాతం పెరిగి రూ.70,785 వద్ద ఉంది. ఒకేరోజులో పసిడి ధర దాదాపు రూ.1500 పెరిగితే.. వెండి కూడా కిలోకు రూ.2 వేల మేర పెరిగింది. 

సోమ‌వారం ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.1500 మేర‌ పెరిగి రూ.53,021కు చేరుకోగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,762కు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల విషయానికి వస్తే.. ఒకే రోజులో వెయ్యికి పైగా పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,000 పెరిగి రూ.49,400కి ఎగబాకగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1090 పెరిగి రూ.53,890కి చేరుకుంది. కిలో వెండి ధర రూ.2,000 పెరిగి రూ. 69,920కి పరుగులు పెట్టింది.

More Telugu News