AP Assembly Session: హైద‌రాబాద్ నుంచే పాలించండి.. ఎవ‌రొద్ద‌న్నారు?: బొత్స‌పై అచ్చెన్న వ్యంగ్యం

  • 2024 వర‌కు హైద‌రాబాదే రాజ‌ధాని అన్న బొత్స‌
  • అక్క‌డికే వెళ్లి పాలించండి అంటూ అచ్చెన్న సెటైర్లు
  • ఏపీ నుంచి పాలించాల‌నే అమ‌రావ‌తికి వ‌చ్చామ‌ని వివరణ  
atchennaidu fires on botsa comments

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల ప్రారంభం రోజున‌నే.. అధికార వైసీపీ, విప‌క్ష టీడీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం చోటుచేసుకుంది. స‌మావేశాల ప్రారంభం సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని టీడీపీ స‌భ్యులు అడ్డుకునే య‌త్నం చేశారు. గో బ్యాక్ గ‌వ‌ర్న‌ర్ అంటూ టీడీపీ స‌భ్యుల నినాదాల‌తో స‌భ మొత్తం కొంత‌సేపు అట్టుడికింది. అయితే టీడీపీ స‌భ్యుల నినాదాల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోని గ‌వ‌ర్నర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం, అధికార పార్టీ వైసీపీ వైఖ‌రిపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన టీడీపీ చివ‌ర‌కు స‌భ నుంచి వాకౌట్ చేసింది.

ఈ సంద‌ర్భంగా శాస‌న‌స‌భ‌లో టీడీపీ ఉపనేత కింజ‌రాపు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ స‌ర్కారు తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ్య‌వ‌స్థ‌ల‌పై దాడి జ‌రిగినా గ‌వ‌ర్న‌ర్ స్పందించ‌లేద‌ని, త‌న పేరు మీద ప్ర‌భుత్వం అప్పులు తీసుకువ‌చ్చినా ప‌ట్టించుకోలేద‌ని విశ్వ‌భూష‌ణ్‌పై అచ్చెన్న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో అన్నీ అవాస్త‌వాలే ఉన్నాయ‌న్న అచ్చెన్న..ఆ కార‌ణంగానే స‌భ నుంచి వాకౌట్ చేసిన‌ట్టు ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉంటే.. ఏపీ రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే కొన‌సాగించాలంటూ ఇటీవ‌లే హైకోర్టు తీర్పును ఇవ్వ‌డం, దానిని టీడీపీ ఆహ్వానించ‌గా, వైసీపీ అసంతృప్తి వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా హైకోర్టు నుంచి స్ప‌ష్ట‌మైన తీర్పు వ‌చ్చినా.. మూడు రాజధానుల‌కే క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించిన అచ్చెన్న‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

2024 వర‌కు తెలంగాణ‌తో పాటు ఏపీకి కూడా హైద‌రాబాదే రాజ‌ధాని అంటూ బొత్స చేసిన వ్యాఖ్య‌ను ప్ర‌స్తావించిన అచ్చెన్న‌.. అయితే హైద‌రాబాద్ నుంచే పాలించాల‌ని, ఎవ‌రొద్ద‌న్నారని వ్యాఖ్యానించారు. తాము మాత్రం రాష్ట్రం నుంచే పాలించాల‌న్న ఉద్దేశ్యంతోనే హైద‌రాబాద్‌ను వీడి అమ‌రావ‌తికి వ‌చ్చామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News