Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడిని చంపేస్తే..?.. సిద్ధంగా అత్యవసర ప్రణాళికలున్నాయన్న అమెరికా!

  • వాటి గురించి మాట్లాడాలని అనుకోవడం లేదన్న అమెరికా విదేశాంగ మంత్రి 
  • రష్యాకు ఆంక్షల దెబ్బ గట్టిగానే తగులుతుందని వ్యాఖ్య 
  • మరి కొంతకాలం పాటు యుద్ధం కొనసాగొచ్చన్న బ్లింకెన్ 
  • రష్యాపై తీవ్ర ప్రభావం చూపుతుందని కామెంట్ 
If Zelensky is assassinated US says Ukraine has alternative plans

‘నన్ను చివరి సారి చూడడం ఇదే కావచ్చు’...
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్వయంగా అన్న మాటలు ఇవి. మరి నిజంగా జెలెన్ స్కీని రష్యా దళాలు చంపేస్తే పరిస్థితి ఏంటి? ఈ సందేహానికి సమాధానం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ నుంచి వచ్చింది. 

‘సీబీఎస్ న్యూస్’కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా బ్లింకెన్ దీనిపై మాట్లాడారు. ఒకవేళ జెలెన్ స్కీని రష్యా అంతం చేస్తే అత్యవసర ప్రణాళికలు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ‘‘ఉక్రేనియన్ల వద్ద ప్రణాళికలు ఉన్నాయి. వాటి గురించి నేను మాట్లాడాలని కానీ, ఆ వివరాల్లోకి వెళ్లాలని కానీ అనుకోవడం లేదు. కానీ, మేము చెప్పినట్టు (ప్రత్యామ్నాయాలు) ప్రభుత్వ కొనసాగింపునకు సంబంధించిన ప్రణాళికలు ఉన్నాయి. దీన్ని అలా వదిలేయండి’’ అని బ్లింకెన్ వివరించారు. 

ఇప్పటి వరకు మూడు హత్యా ప్రయత్నాల నుంచి జెలెన్ స్కీ సురక్షితంగా తప్పించుకున్నట్లు కథనాలు వస్తున్న నేపథ్యంలో బ్లింకెన్ ఇలా స్పందించడం గమనార్హం. ‘‘జెలెన్ స్కీ ప్రభుత్వం గొప్పగా పని చేస్తోంది. ధైర్యవంతులైన ఉక్రెయిన్ ప్రజల ప్రతినిధులుగా వారు పనిచేస్తున్నారు. ఒక రోజు క్రితమే నేను ఉక్రెయిన్ లో ఉన్నాను. ఉక్రెయిన్ ప్రభుత్వం కొనసాగింపు లేదంటే ప్రత్యామ్నాయం ఉందని నా మిత్రుడు దిమిత్రో కులేబా చెప్పారు’’ అని బ్లింకెన్ తెలిపారు. 

రష్యాపై విధించిన ఆంక్షల ప్రభావం ఉంటుందని బ్లింకెన్ చెప్పారు. రష్యా నుంచి ప్రాథమిక వస్తువులను కూడా కొనుగోలు చేయలేరని పేర్కొన్నారు. ఇది రష్యాపై ఎంతో ప్రభావం చూపిస్తుందన్నారు. అదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పై దాడిని మరింత ఉద్ధృతం చేశారని... దీనికి మనం సన్నద్ధంగా ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. దురదృష్టవశాత్తూ ఇది మరికొంత కాలం పాటు కొనసాగొచ్చన్నారు.

More Telugu News