NSE: ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ అరెస్ట్

CBI arrests former National Stock Exchange CEO Chitra Ramkrishna
  • ముందస్తు బెయిలు దరఖాస్తును తిరస్కరించిన కోర్టు
  • ఆ వెంటనే కస్టడీలోకి తీసుకున్న సీబీఐ
  • ఎన్ఎస్ఈ రహస్య సమాచారాన్ని ‘యోగి’తో పంచుకున్నట్టు అభియోగాలు
నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను సీబీఐ నిన్న అరెస్ట్ చేసింది. 59 ఏళ్ల చిత్ర పెట్టుకున్న ముందస్తు బెయిలు పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో సీబీఐ అధికారులు నిన్న న్యూఢిల్లీలో ఆమెను అరెస్ట్ చేశారు. 2013-2016 మధ్య చిత్ర ఎన్ఎస్ఈ సీఈవోగా పనిచేశారు. ఆ సమయంలో ఎన్‌ఎస్‌ఈకి సంబంధించిన రహస్య సమాచారాన్ని హిమాలయాల్లో నివసించే ‘యోగి’తో ఈ-మెయిల్ ద్వారా పంచుకున్నట్టు ఆమెపై అభియోగాలున్నాయి. ఆ ‘యోగి’ మరెవరో కాదని, ఎన్ఎస్ఈ మాజీ ఉద్యోగి ఆనంద్ సుబ్రహ్మణ్యమేనని అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఆయన ఈ నెల మొదట్లోనే అరెస్టయ్యారు. 

2010-2015 మధ్య ఎన్ఎస్ఈలో అవకతవకలు జరిగినట్టు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) గుర్తించి బయటపెట్టిన తర్వాత ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఎన్ఎస్ఈకి సంబంధించిన రహస్య సమాచారాన్ని చిత్రా రామకృష్ణ  2014-16 మధ్య ఈ-మెయిల్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తితో పంచుకున్నట్టు సెబీ గుర్తించింది. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించింది. 

ఈ కేసుకు సంబంధించి 2018లోనే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎన్ఎస్ఈ వ్యవస్థను ఓ స్టాక్‌ బ్రోకర్ తారుమారు చేసినట్టు అందులో ఆరోపించింది. స్టాక్ బ్రోకర్ సంజయ్ గుప్తాకు ఎన్ఎస్ఈ కో-లొకేషన్ సదుపాయానికి యాక్సెస్ కూడా ఉందని, ఫలితంగా గుప్తా సంస్థ ఓపీజీ సెక్యూరిటీ లిమిటెడ్ ఇతరుల కంటే ముందుగానే మార్కెట్ డేటాను యాక్సెస్ చేయడానికి వీలు కలిగిందని సీబీఐ ఆరోపించింది.
NSE
Chitra Ramkrishna
CBI
Yogi
Anand Subramaniam

More Telugu News