Mohan Babu: మోహన్ బాబు, మంచు విష్ణుపై మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు

Complaint in HRC against Mohan Babu and Manchu Vishnu
  • హెయిర్ డ్రెస్సర్ వివాదంలో మోహన్ బాబు, మంచు విష్ణు
  • కులం పేరుతో దూషించారని ఆరోపణలు
  • మండిపడుతున్న నాయీబ్రాహ్మణ సంఘం
  • చర్యలు తీసుకోవాలంటూ హెచ్చార్సీలో ఫిర్యాదు
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణులను హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీను వివాదం ఇంకా వీడలేదు. ఈ వివాదం నేపథ్యంలో మోహన్ బాబు, మంచు విష్ణులపై మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)లో ఫిర్యాదు దాఖలైంది. 11 ఏళ్లుగా పనిచేస్తున్న నాగశ్రీనును కులం పేరుతో దూషించారంటూ నాయీబ్రాహ్మణ సంఘం నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. నాయీబ్రాహ్మణ కులాన్ని కించపరిచినందుకు మోహన్ బాబు, విష్ణులపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో కోరారు. 

ఈ సందర్భంగా నాయీబ్రాహ్మణ సంఘం నేత శ్రీనివాస్ స్పందిస్తూ, నాగశ్రీను గత 11 ఏళ్లుగా మోహన్ బాబు నివాసంలో నమ్మకంగా పనిచేస్తున్నాడని, అతడిని కులం పేరుతో దూషించడం దారుణమని పేర్కొన్నారు. నాగశ్రీను విషయంలో క్షమాపణలు చెప్పేందుకు రెండ్రోజుల సమయం ఇచ్చామని, వారు స్పందించకపోవడంతో హెచ్చార్సీని ఆశ్రయించామని శ్రీనివాస్ చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా కుల దూషణ పోలేదని విచారం వ్యక్తం చేశారు. ఈ కేసును పోలీసులు కూడా తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఇటీవల మంచు విష్ణు కార్యాలయం నుంచి నాగశ్రీను రూ.5 లక్షల విలువైన వస్తువులు ఎత్తుకెళ్లాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. మంచు విష్ణు లీగల్ విభాగం ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తనపై అక్రమంగా కేసు బనాయించారని నాగశ్రీను ఆరోపిస్తున్నాడు. ఇటీవలే మెగాబ్రదర్ నాగబాబు... నాగశ్రీను కుటుంబానికి ఆర్థికసాయం అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Mohan Babu
Manchu Vishnu
Naga Srinu
HRC

More Telugu News