Jadeja: రాక్ స్టార్ జడేజా.. షేన్ వార్న్ గర్వపడేలా చేశావ్: రాజస్థాన్ రాయల్స్

You have made him proud Rajasthan Royals remembers Warnes Rockstar tag given to Jadeja
  • శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా జడేజా సెంచరీ
  • అభినందిస్తూ రాజస్థాన్ రాయల్స్ జట్టు ట్వీట్
  • జడేజాకు రాక్ స్టార్ బిరుదు ఇచ్చింది షేన్ వార్న్
శ్రీలంక-భారత జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ లో రవీంద్ర జడేజా సెంచరీ సాధించడం పట్ల ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సానుకూలంగా స్పందించింది. తమ జట్టు ఆటగాడు కాకపోయినప్పటికీ హృదయపూర్వకంగా మెచ్చుకుంది. 

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ శనివారం గుండెపోటుతో అకాల మరణం పాలైన విషయం తెలిసిందే. షేన్ వార్న్, జడేజా ఇద్దరూ ఐపీఎల్ ఆరంభంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి కలసి పనిచేశారు. ఆ సమయంలో జడేజాను రాక్ స్టార్ గా ఎన్నో సందర్భాల్లో షేన్ వార్న్ అభినందించడాన్ని రాజస్థాన్ రాయల్స్ గుర్తు చేసింది. ఆల్ రౌండర్ గా జడేజా ప్రతిభను షేన్ వార్న్ మెచ్చుకునే వాడు. 

2008 ఆరంభ కప్ ను రాజస్థాన్ రాయల్స్ గెలుచుకుంది. నాటి జట్టులో వార్న్, జడేజా భాగస్వాములుగా ఉన్నారు. రెండు సీజన్ల తర్వాత జడేజా రాజస్థాన్ జట్టు నుంచి చెన్నై జట్టుకు మారిపోయాడు. వార్న్ మెచ్చుకున్న ఆటగాడిగా సెంచరీ సాధించి అతడ్ని గర్వపడేలా చేశావంటూ రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది.

నిజానికి వార్న్ తనను రాక్ స్టార్ గా ఎందుకు పిలిచేదీ జడేజాకు మొదట అర్థం కాలేదు. ‘‘నన్ను రాక్ స్టార్ గా ఎందుకు పిలుస్తున్నాడంటూ నా స్నేహితుడ్ని అడిగాను. నీ ముఖంలో ఎంతో నవ్వు కనిపిస్తుంది. ఆట కోసం ఎంతో కష్టపడతావు. అది బౌలింగ్ అయినా, బ్యాటింగ్ అయినా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటావు’’ అని చెప్పాడంటూ జడేజా ఓ సందర్భంలో వెల్లడించడం గమనార్హం.
Jadeja
Cricket
century
shane warne
rajasthan royals

More Telugu News