Mandira Bedi: చీర కట్టుకున్న మహిళ క్రికెట్ మాట్లాడడం వారికి నచ్చేది కాదు: మందిరాబేడి

  • సుదీర్ఘకాలం పాటు క్రికెట్ కామెంటర్ గా మందిరాబేడి సేవలు
  • ఎన్నో సినిమాల్లో నటనతోనూ రాణింపు
  • నా ప్రశ్నలకు క్రికెటర్ల నుంచి అసంబద్ధ సమాధానాలు
  • నా పట్ల తదేకంగా చూసేవారు
  • సోనీ ఇచ్చిన అభయంతో కొనసాగానన్న మందిర
Mandira Bedi recalls getting stared down by cricketers while interviewing them

‘మందిరా బేడీ’ క్రికెట్ అభిమానులకు ఈ పేరు పరిచయమే. చక్కని చీర కట్టుతో, కట్టిపడేసే అందంతో క్రికెట్ వ్యాఖ్యాతగా ఆమె అందించిన సేవలు చాలా మందికి గుర్తుండే ఉంటాయి. మ్యాచ్ కు ముందుగా తాను నిర్వహించే కార్యక్రమాల సందర్భంగా క్రికెటర్లు తనను తదేకంగా చూసేవారని ఆమె తాజాగా చెప్పారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా పాత సంగతులను ఆమె ఒకసారి గుర్తు చేసుకున్నారు.  

క్రికెట్ టోర్నమెంట్ లకు కామెంటేటర్ గా వ్యహరించిన అతి కొద్ది మంది మహిళల్లో మందిరాబేడి ఒకరు. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2003, 2007, ఛాంపియన్ ట్రోఫీలు 2004, 2006, ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2కు సోనీమ్యాక్స్ టీవీ తరఫున హోస్ట్ గా వ్యవహరించారు. ఐపీఎల్ 3 సీజన్ సమయంలో బ్రిటిష్ నెట్ వర్క్ కు చెందిన ఐటీవీకి సేవలు అందించారు.

‘‘నాతో కార్యక్రమం మొదలు పెట్టేందుకు ఎవరూ అనుమతించేవారు కాదు. నాకు ఎంతో మంది క్రికెటర్లు స్నేహితులుగా ఉన్నారు. అయినా వారు నన్ను ఆమోదించే వారు కాదు. చీర కట్టుకున్న ఓ మహిళ క్రికెట్ గురించి మాట్లాడడం వారికి నచ్చేది కాదు. నన్ను ఏ విధమైన ప్రశ్నలు అడగనిచ్చేవారు కాదు. 

ఆ నిర్దిష్ట సమయంలో మీ మనసులో ఏ ప్రశ్న తలెత్తితే దానినే అడగాలంటూ నాకు ఆదేశాలు ఉన్నాయి. అంత స్వేచ్ఛ నాకుంది. ఆమె ఏమి అడుగుతోంది, ఎందుకు అడుగుతోంది అన్నట్టుగా చాలా మంది క్రికెటర్లు తదేకంగా చూసేవారు. నా ప్రశ్నకు సంబంధం లేకుండా వారికి తోచిన సమాధానం ఇచ్చేవారు. అది నన్ను చాలా భయపెట్టేది. కానీ, ‘నిస్సంకోచంగా ముందుకు వెళ్లండి. మీ తరహాలో మీరు ఉంటూ ఆస్వాదించండి’ అంటూ నాకు సోనీ చానల్ నుంచి అభయం ఉంది’’ అని మందిరా బేడి తెలిపారు. 

దిల్ వాలే దుల్హహనియా లేజాయేంగే, బాదల్, షాదీకా లడ్డూ, దస్ కహానియాన్, మేరే బాయ్ నాటౌట్, ద తాష్కెంట్ ఫైల్స్.. ఇలా ఎన్నో సినిమాల్లో మందిరాబేడి నటించారు.

More Telugu News