Basavaraj Bommai: కర్ణాటకలో ఆలయాలకు స్వయంప్రతిపత్తి.. కాశీ యాత్రకు సబ్సిడీ

Karnataka temples to get autonomy
  • బడ్జెట్ లో కీలక డిమాండ్లకు చోటు
  • 2023 ఎన్నికల్లో అధికారంపై గురి
  • కాశీ యాత్రకు రూ.5,000 సబ్సిడీ
  • గోవుల సంరక్షణకు దత్తత కార్యక్రమం

కర్ణాటక సర్కారు తన తాజా బడ్జెట్ (2022-23)లో సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన హిందువులకు పెద్దపీట వేసింది. ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం వద్దన్న డిమాండ్ కు తలవొగ్గింది. గో సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చింది. కాశీ యాత్రకు సబ్సిడీ ప్రకటించింది.

‘‘ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణ తొలగిపోవాలన్నది దీర్ఘకాలం నుంచి ఉన్న డిమాండ్. భక్తుల కోరిక మేరకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు స్వయంప్రతిపత్తి ఇవ్వనున్నాం. ఆలయాల అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకుంటాం’’అని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. 

మరోపక్క, పవిత్ర యాత్ర పథకాన్ని బడ్జెట్ లో ప్రకటించింది. కర్ణాటక రాష్ట్ర పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా దీన్ని నిర్వహించనుంది. కర్ణాటక నుంచి కాశీ యాత్రకు వెళ్లే 30 వేల మంది భక్తులకు ప్రభుత్వం రూ.5,000 చొప్పున సబ్సిడీ భరించనుంది. 

గతేడాది యడియూరప్ప దిగిపోయిన తర్వాత బస్వరాజ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో తిరిగి అధికారం సాధించడం, తన స్థానాన్ని బలోపేతం చేసుకునే లక్ష్యంగా బడ్జెట్ లో ఎన్నో ప్రతిపాదనలకు చోటు కల్పించినట్టు తెలుస్తోంది.

పశువధ నిరోధక బిల్లు కింద ప్రతి ఒక్కరు రూ.11,000ను వార్షిక విరాళం ఇవ్వడం ద్వారా ఒక గోవును దత్తత తీసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. గోవులను వధించకుండా వాటిని గోశాలలకు తరలించి సంరక్షించడమే ఈ బిల్లు లక్ష్యం. సీఎం బసవరాజ్ బొమ్మై సైతం 11 ఆవులను దత్తత తీసుకున్నారు.

  • Loading...

More Telugu News