Telangana: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. పార్టీ బలోపేతానికి వనపర్తిలో సభ: అలంపూర్ ఎమ్మెల్యే

  • అయిజలో నిన్న రహదారి పనుల ప్రారంభోత్సవం
  • కేంద్రం మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని వ్యాఖ్య
  • ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపు
  • ఈ నెల 8న వనపర్తిలో భారీ బహిరంగ సభ
Alampur MLA Says There is a possible to Early Elections in telangana

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తప్పవా? అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం వ్యాఖ్యలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో నిన్న రహదారి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని అన్నారు. 

కేంద్రం మనకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని, కాబట్టి వాటిని ఎదుర్కోవడానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అన్నారు. ఎన్నికలను ఎదుర్కోవాలంటే పార్టీ బలోపేతం కావాల్సి ఉందని పేర్కొన్న ఆయన ఈ నెల 8న వనపర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రతి గ్రామం నుంచి ఈ సభకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ముందస్తు ఎన్నికలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమయ్యాయి.

More Telugu News