Indian students: ఉక్రెయిన్ వీడిన వైద్య విద్యార్థులు.. కోర్సు పూర్తి చేసుకునేందుకు ఇక్కడే అవకాశం!

Govt exploring ways to help evacuees complete studies
  • కుదిరితే దేశీ వైద్య కళాశాలల్లో ప్రవేశాలు
  • లేదంటే విదేశీ యూనివర్సిటీలకు బదిలీ
  • త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం
  • నిబంధనల్లో మార్పులు చేయాలన్న సూచనలు
ఉక్రెయిన్ నుంచి భారత్ కు తిరిగి వచ్చిన విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్ర సర్కారు సమాలోచనలు చేస్తోంది. ముఖ్యంగా వైద్య విద్యా కోర్సు చేస్తున్న మూడు, నాలుగో సంవత్సరం విద్యార్థులు, మిగిలిన కోర్సు కాలాన్ని దేశీయ మెడికల్ కళాశాలల్లో పూర్తి చేసుకునే విధంగా ఉన్న అవకాశాలను పరిశీలించనుంది. 

నేషనల్ మెడికల్ కౌన్సిల్, కేంద్ర ప్రభుత్వం దీనిపై చర్చిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులకు భారతీయ వైద్య కళాశాలల్లో సర్దుబాటు చేసుకోవడం లేదంటే విదేశీ యూనివర్సిటీలలో అవకాశం కల్పించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాయి. వీరు కోర్సు ముగిసిన తర్వాత నీట్-ఎఫ్ఎంజీ పరీక్షలో తుది అర్హత సాధించాల్సి ఉంటుంది. కనీసం విదేశీ యూనివర్సిటీలకు బదిలీ చేసే విధంగా నిబంధనల్లో మార్పులు చేయాలంటూ ప్రభుత్వానికి సూచనలు వచ్చినట్టు సమాచారం. 

‘‘మానవతా కోణంలో దీన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఎంత మంది విద్యార్థులపై ఈ ప్రభావం ఉందన్నది ముందు చూడాలి. అందులో మూడు, నాలుగో ఏడాది కోర్సులు చేస్తున్న వారు ఎంత మంది ఉన్నారన్న దానితో పాటు, ప్రస్తుత నిబంధనలను పరిశీలించాల్సి ఉంది. వారికి సాయం విషయంలో సాధ్యమైన ప్రతిదీ మేము చేస్తాం’’ అని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

నేషనల్ మెడికల్ కౌన్సిల్, కేంద్ర ఆరోగ్య శాఖ, నీతి ఆయోగ్ త్వరలోనే సమావేశమై ఈ అంశంపై చర్చించనున్నట్టు సదరు వర్గాలు వెల్లడించాయి. సంబంధిత మంత్రిత్వ శాఖలు దీనిపై చర్చిస్తున్నాయని, సాధ్యమైన పరిష్కారంతో ముందుకు రానున్నట్టు కేంద్ర ఆరోగ్య  శాఖ అధికారి ఒకరు తెలిపారు.
Indian students
Ukraine
medical couses
central govt

More Telugu News