Ukraine: కీవ్ ను వదిలి వెళ్లిపోతున్న భారత విద్యార్థిపై కాల్పులు

  • కీవ్ లోని ఆసుపత్రిలో చికిత్స
  • వెల్లడించిన కేంద్ర మంత్రి వి.కె. సింగ్
  • యుద్ధపు తూటా మతం, దేశం చూడదని కామెంట్
Indian Student Injured In Kyiv While Fight Going On

ఉక్రెయిన్ లో మరో విషాదం చోటు చేసుకుంది. రష్యా దాడిలో మొన్నటికి మొన్న ఓ విద్యార్థి చనిపోగా.. తాజాగా మరో విద్యార్థి తీవ్రగాయాలపాలయ్యాడు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి వెళ్లిపోతుండగా.. రష్యా చేసిన కాల్పుల్లో భారతీయ విద్యార్థి గాయపడినట్టు కేంద్ర మంత్రి వి.కె. సింగ్ వెల్లడించారు. దీంతో ఆ విద్యార్థిని మళ్లీ కీవ్ లోకి తీసుకెళ్లారని, ఆసుపత్రిలో చేర్పించారని చెప్పారు. 

‘‘కీవ్ నుంచి వెళ్లిపోతున్న భారత విద్యార్థిపై కాల్పులు జరిగినట్టు మాకు తెలిసింది. ఆ విద్యార్థిని కీవ్ లోని ఆసుపత్రిలో చేర్పించారు. రష్యా–ఉక్రెయిన్ మధ్య ఫైటింగ్ లో ఈ ఘటన జరిగింది’’ అని పేర్కొన్నారు. కీవ్ మీద దాడులు మరింత తీవ్రమయ్యే ప్రమాదముండడంతో అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఇప్పటికే అక్కడి భారత రాయబార కార్యాలయం భారతీయులకు సూచించిందని గుర్తు చేశారు. యుద్ధమంటూ వస్తే తుపాకుల తూటాలు మతం, దేశం చూడవని అన్నారు. కాగా, ఆ విద్యార్థి ఎవరన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. 

మూడు రోజుల క్రితం ఖార్కివ్ లో రష్యా చేసిన రాకెట్ దాడిలో కర్ణాటకకు చెందిన శేఖరప్ప జ్ఞానగౌడార్ అనే మెడిసిన్ చివరి సంవత్సరం విద్యార్థి మరణించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం వి.కె. సింగ్ పోలెండ్ లో ఉండి విద్యార్థుల తరలింపులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల తరలింపుల కోసం నలుగురు కేంద్ర మంత్రులను ప్రత్యేక రాయబారులగా ఆయా దేశాలకు పంపిన సంగతి తెలిసిందే.

More Telugu News