Hyderabad: ఐదున్నర రూపాయలు ఎక్కువగా వసూలు చేసిన హైదరాబాదులోని బిర్యానీ హౌస్‌కు రూ.55 వేల జరిమానా!

Rs 55 thousand fine to Hyderabad tilaknagar biryani house
  • స్నేహితులతో కలిసి లక్కీ బిర్యానీ సెంటర్‌లో బిర్యానీ తిన్న వంశీ
  • వాటర్ బాటిల్‌కు రూ. 5.50 ఎక్కువగా వసూలు
  • ప్రశ్నిస్తే దురుసుగా సమాధానం
  • వినియోగదారుల ఫొరంలో బిర్యానీ హౌస్‌కు మొట్టికాయలు
వినియోగదారు నుంచి బిల్లుకంటే ఐదున్నర రూపాయలు ఎక్కువగా వసూలు చేసిన హైదరాబాద్‌లోని ఓ బిర్యానీ హౌస్‌కు వినియోగారుల ఫోరంలో ఎదురుదెబ్బ తగిలింది. బిల్లుకు మించి డబ్బులు వసూలు చేసిన హోటల్‌కు మొత్తంగా రూ. 55 వేలు వడ్డించింది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న చిలుకూరి వంశీ తన నలుగురు స్నేహితులతో కలిసి తిలక్‌నగర్‌లోని లక్కీ బిర్యానీ హౌస్‌కు వెళ్లి బిర్యానీ తిన్నారు. మొత్తం బిల్లు రూ.1,075 అయింది. జీఎస్టీతో కలుపుకుని మొత్తంగా రూ.1,127 అయింది. 

అయితే, మినరల్ వాటర్ బాటిల్‌కు అదనంగా రూ. 5.50 ఎక్కువగా వసూలు చేసినట్టు గుర్తించిన వంశీ హోటల్ సిబ్బందిని ప్రశ్నిస్తే దురుసుగా సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా స్నేహితుల ముందు తనను అవమానించడంతో ఈ విషయాన్ని అతడు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. విచారించిన జిల్లా వినియోగదారుల కమిషన్-2 బెంచ్ అధ్యక్షుడు వక్కంటి నర్సింహారావు తీర్పు వెలువరించారు. 

ఫిర్యాదుదారుడిపై పరుష పదజాలం ఉపయోగించడంతోపాటు సేవల్లో లోపం జరిగిన విషయాన్ని నిర్ధారించింది. దీంతో వినియోగదారుడి నుంచి వసూలు చేసిన రూ. 5.50కి 10 శాతం వడ్డీతో చెల్లించడంతోపాటు అతడికి రూ. 5 వేల నష్టపరిహారం ఇవ్వాలని, 45 రోజుల్లో జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అలాగే, జిల్లా వినియోగదారుల సంరక్షణ మండళ్ల సంక్షేమానికి రూ. 50 వేలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చెల్లించాలని ఆదేశించారు. అంతేకాదు, మరోమారు ఇలాంటి పొరపాటు చెయ్యొద్దని మందలించింది.
Hyderabad
Tilak Nagar
Biryani House
Fine

More Telugu News